డెస్క్ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్ కార్డులే
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:34 AM
డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ప్రకటించినట్లుగా మీడియా కార్డులు కాకుండా...
జీవో 252 నుంచి ‘మీడియా కార్డులు’ పదం తొలగింపు
డెస్క్ జర్నలిస్టుల్లో మహిళలకు 33ు కార్డులు తప్పనిసరి
రాష్ట్ర మీడియా కమిటీలో ప్రెస్ క్లబ్, డెస్క్ జర్నలిస్టుల నుంచి ఒక్కొక్కరికి స్థానం
సవరణ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ప్రకటించినట్లుగా మీడియా కార్డులు కాకుండా... అక్రెడిటేషన్ కార్డులనే జారీ చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సీహెచ్ ప్రియాంక సోమవారం సవరణ ఉత్తర్వుల (జీవో నెంబర్ 103)ను జారీ చేశారు. రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు, డెస్క్‌లలో పని చేసే పాత్రికేయులకు మీడియా కార్డులను జారీ చేయనున్నట్లు గత ఏడాది డిసెంబరు 22న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో నెంబర్ 252) జారీ చేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులను రెండు వర్గాలుగా విభజించటం పట్ల అప్పట్లో పాత్రికేయ సంఘాలు, డెస్క్ జర్నలిస్టుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని కలిసి, రెండు రకాల కార్డులను జారీ చేయడం సమంజసం కాదని, అందరికీ అక్రెడిటేషన్ కార్డులనే జారీ చేయాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి.. ఉత్తర్వులను సవరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా మీడియా కార్డులు అనే పదాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 252 జీవోలో ‘మీడియా కార్డులు’ అని పేర్కొన్న ప్రతి చోటా ‘అక్రెడిటేషన్ కార్డులు’ అని మార్చింది. దీంతో డెస్క్ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్ కార్డులే అందనున్నాయి.
33 శాతం మహిళలకు
డెస్క్ జర్నలిస్టుల్లో కనీసం 33 శాతం కార్డులను మహిళా జర్నలిస్టులకు కేటాయించాలని మీడియా సంస్థలకు ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. అక్రెడిటేషన్ కార్డుల జారీ సందర్భంలో మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించింది. ప్రింట్ మీడియా క్యాటగిరీలో... 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలవారికి 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలంలో అదనంగా మరో అక్రెడిటేషన్ కార్డును జారీ చేయనుంది. ఈ పత్రికలకు రాష్ట్ర స్థాయిలో క్రీడలు, సాంస్కృతికం, సినిమా క్యాటగిరీల్లో అదనంగా ఒక్కో కార్డు ఇవ్వనుంది. 75,001 నుంచి 2.5 లక్షల మధ్య సర్క్యులేషన్ ఉన్న పబ్లికేషన్‌కు స్పోర్ట్స్, సాంస్కృతికం, సినిమాకు సంబంధించి ఏదేని ఒక క్యాటగిరీలో అదనంగా రాష్ట్ర స్థాయి కార్డును జారీ చేయనుంది. గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న ‘ఉర్దూ బిగ్ న్యూస్ పేపర్’ స్థానంలో ‘ఉర్దూ డెయిలీ న్యూస్ పేపర్’ అనే పదాన్ని చేర్చింది. ఇక రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ)లో ప్రెస్ క్లబ్ నుంచి ఒకరికి, పెద్ద దిన పత్రికలో పని చేసే డెస్క్ జర్నలిస్టుల నుంచి ఒకరికి సభ్యత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.