Share News

44వేలకు పైగా అక్రెడిటేషన్‌ కార్డుల జారీ!

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:42 AM

రాష్ట్రంలో 44వేలకు పైగా అక్రెడిటేషన్‌ కార్డులను జారీ చేయనున్నామని, అర్హత కలిగిన ప్రతీ జర్నలిస్టుకూ కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

44వేలకు పైగా అక్రెడిటేషన్‌ కార్డుల జారీ!

  • పాత జీవో ప్రకారమే: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 44వేలకు పైగా అక్రెడిటేషన్‌ కార్డులను జారీ చేయనున్నామని, అర్హత కలిగిన ప్రతీ జర్నలిస్టుకూ కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టులకు కార్డుల జారీ విధానం, అక్రెడిటేషన్‌ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలో ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ ప్రియాంక, ఇతర అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. గతంలో సుమారు 23వేల మందికి మాత్రమే అక్రెడిటేషన్‌ కార్డులు ఉండగా, ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరో 21వేల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన వివరించారు. జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు పాత జీవో ప్రకారమే కార్డులు జారీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా, డిజిటల్‌మీడియా విభాగాల్లో కలిపి మొత్తం 44,706 కార్డులు వచ్చే అవకాశం ఉందని మంత్రి వివరించారు. అయితే కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 05:42 AM