Share News

మరిన్ని ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి, ఐవీఎఫ్‌

ABN , Publish Date - May 02 , 2026 | 05:10 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి, ఐవీఎఫ్‌ వైద్య సేవలను విస్తరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

మరిన్ని ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి, ఐవీఎఫ్‌

  • ప్రభుత్వ దవాఖానాల్లో ఆయా సేవలను విస్తరిస్తాం.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

  • గాంధీ ఆస్పత్రిలో స్టేట్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌, మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి, ఐవీఎఫ్‌ వైద్య సేవలను విస్తరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టేట్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌, మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిలోనూ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో ఆర్గాన్‌ రిట్రీవల్‌ సెంటర్లను(దాతల నుంచి అవయవాలు సేకరించే కేంద్రాలు) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక, రూ.40 కోట్ల వ్యయంతో గాంధీ ఆస్పత్రిలో స్టేట్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ను నెలకొల్పామని మంత్రి చెప్పారు. ఈ కేంద్రంలో 6 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, 25 పడకలతో 3 ఐసీయూలు, ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు సదుపాయాలు ఉన్నాయని వివరించారు. అలాగే, 2024లో గాంధీలో ప్రారంభించిన ఐవీఎఫ్‌ సెంటర్‌ ద్వారా అనేక మంది దంపతులు సంతానం పొందుతున్నారని చెప్పారు. గాంధీలో ఐవీఎఫ్‌ చేయించుకున్న దంపతులకు కవలలు జన్మించారని ఆనందం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రితోపాటు పేట్లబుర్జులోని ఐవీఎఫ్‌ కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో రోజుకు 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ఏ శిశువుకైనా తల్లిపాలు అందుబాటులో లేకపోతే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ ద్వారా తల్లిపాలను సరఫరా చేస్తామని చెప్పారు. ఇక, మత్తు పదార్ధాలకు బానిసలైన వారికి చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో 10 పడకలతో సబ్‌స్టెన్స్‌ ఇంటాక్సికేషన్‌ కేర్‌ యూనిట్‌, డీ-అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.


రూ.2,700 కోట్ల వ్యయంతో 2000 పడకలతో గోషామహల్‌ ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, గత రెండేళ్లలో రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్లు 1,121 నుంచి 1,266కు పెరిగాయని, మరో 388 సీట్లకు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించామని మంత్రి దామోదర ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయన్నారు. గత రెండేళ్లలో కొత్తగా 9 మెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీలు, 28 పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. గాంధీ, ఉస్మానియా విద్యార్థుల కోసం రూ.210 కోట్లతో అత్యాధునిక హాస్టల్‌ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. వైద్య ఖర్చులను భరించలేక ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని మంత్రి వివరించారు. కాగా, గాంధీ వైద్య కళాశాల 68వ బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థుల స్నాతకోత్సవంలోనూ పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ పలువురికి పట్టాలు చేశారు. వైద్య వృత్తి ఉద్యోగం కాదని, జీవితాంతం మానవసేవకు అంకితమయ్యే కర్తవ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - May 02 , 2026 | 05:10 AM