Share News

సీఎంఆర్‌ బకాయిలపై సర్కార్‌ సీరియస్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:37 AM

రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిలు పేరుకుపోయిన రైస్‌మిల్లర్ల పట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది....

సీఎంఆర్‌ బకాయిలపై సర్కార్‌ సీరియస్‌

  • పరిమాణంతో పాటు 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీ వసూలు

  • బకాయిలు చెల్లించిన వారికే కొత్త ధాన్యం కేటాయింపులు

  • ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

హైదరాబాద్‌/ మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిలు పేరుకుపోయిన రైస్‌మిల్లర్ల పట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని, తిరిగి బియ్యం అప్పగించడంలో విఫలమైన మిల్లర్ల నుంచి జరిమానా, వడ్డీతో సహా మొత్తం వసూలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యంగా 2024-25 ఖరీఫ్‌ సీజన్‌తో పాటు 2014-15 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న బియ్యం బకాయిలకు సంబంధించి, ఆ పరిమాణం విలువకు సమానమైన ధరతో పాటు 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీని కలిపి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఫిబ్రవరిలో ముగిసిన ఒప్పంద గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ, ఈ లోపు బకాయిలు చెల్లించిన మిలర్లకు మాత్రమే కొత్తగా ధాన్యం కేటాయిస్తామని కమిషనర్‌ స్పష్టం చేశారు. మరోవైపు, మహబూబాబాద్‌ జిల్లాలో అధికారులు బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో మొత్తం 80 రైస్‌ మిల్లులు ఉండగా, అందులో 21 మిల్లులను డిఫాల్ట్‌ మిల్లులుగా సివిల్‌ సప్లై అధికారులు గుర్తించారు. దాదాపు 13 ఏళ్లుగా పేరుకుపోయిన ఈ బకాయిల వ సూళ్ల కోసం ఇప్పటికే ఆరు మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద చర్యలు చేపట్టగా, మరో పది మిల్లుల యజమానులపై కేసులు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి బదులుగా 67 ు బియ్యాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత అధికారుల ఉదాసీనత వల్ల ఈ బకాయిలు పెరిగిపోయాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లో నిబంధనలు పాటించిన 59 మిల్లులకు మాత్రమే సీఎంఆర్‌ ధాన్యం కేటాయించి, బకాయిలు ఉన్న 21 రైస్‌ మిల్లులను పక్కన పెట్టారు. జూన్‌ 15లోపు పెనాల్టీతో సహా బకాయిలు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ నర్సింహారావు మిల్లర్లను హెచ్చరించారు.

Updated Date - Apr 30 , 2026 | 05:37 AM