Share News

Telangana Government: మునిసిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ..పట్టణాభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:06 AM

మునిసిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. పట్టణాభివృద్ధికి సర్కారు పెద్ద పీట వేస్తోంది. మరో రెండు వారాల్లో ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసే అవకాశం ఉండటంతో......

Telangana Government: మునిసిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ..పట్టణాభివృద్ధికి పెద్దపీట

  • పెండింగ్‌ ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం తెలుపుతున్న సర్కారు

  • తాజాగా స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ కింద రూ.10 కోట్లు విడుదల

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. పట్టణాభివృద్ధికి సర్కారు పెద్ద పీట వేస్తోంది. మరో రెండు వారాల్లో ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసే అవకాశం ఉండటంతో వీలైనంత మేరకు పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ కోర్‌ అర్బన్‌ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలన్న సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం అక్టోబరులో భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. మునిసిపల్‌ శాఖ ఇచ్చిన ప్రతిపాదనలతో రాష్ట్రంలోని 138 మునిసిపాలిటీల్లో రూ.2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టారు. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన నగరాభివృద్థి నిధులతోపాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్‌) నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మునిసిపాలిటీలకు రూ.20 కోట్లు, పాత మునిసిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. తాజాగా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణ సంస్థలకు స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ కింద గురువారం రూ.10 కోట్లు పరిపాలనా అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ సిఫారసుల్లో భాగంగా ఈ నిధులు కేటాయించారు. అలాగే.. ‘అసిస్టెన్స్‌ టు మున్సిపాలిటీలు’ అనే పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన మునిసిపల్‌ కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్య క్రమంలో ఈ నిధులను ఖర్చు చేయాలని మునిసిపల్‌ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. మునిసిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, వాణిజ్య సముదాయాల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని మునిసిపాలిటీల్లో సంబంధిత విభాగాలు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులు సూచించారు. మార్చి నాటికి అన్ని పనులూ పూర్తి చేయాలని గడువు నిర్ణయించారు.

Updated Date - Jan 09 , 2026 | 05:06 AM