Tummla Nageshwar Rao: చేనేత రుణమాఫీకి మరో 16.27కోట్లు
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:17 AM
చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి మరో రూ.16.27 కోట్లు విడుదల చేసినట్లు చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
గతంలో రూ.33 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
6,784 మందికి రుణ విముక్తి కలిగింది: తుమ్మల
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి మరో రూ.16.27 కోట్లు విడుదల చేసినట్లు చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో రూ.33 కోట్లు విడుదల చేయగా.. తాజాగా విడుదల చేసిన రూ.16.27 కోట్లతో కలిపి మొత్తం రూ.49.27 కోట్లతో రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6,784 మంది చేనేత కార్మికులకు రుణ విముక్తి కలిగిందన్నారు. 2017 జనవరి1 నుంచి 2024 మార్చి 31వరకు రూ.లక్ష వరకున్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణ బకాయిలు మాఫీ చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.960 కోట్లు ఖర్చు చేశామని, చేనేత కార్మికులకు నిత్యం పనికల్పించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలు, టెస్కో వస్త్రాలు కొనాలనే నిబంధన విధించినట్లు గుర్తు చేశారు. రూ.896 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఇందిరా మహిళాశక్తి చీరల పథకంతో 30 వేల మరమగ్గాలకు నిరంతరం పని కల్పిస్తున్నామని, రూ.150 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు.