Share News

ఇప్పటివరకు ఏంచేశారు

ABN , Publish Date - May 19 , 2026 | 05:22 AM

రాష్ట్రంలో పరిశ్రమలు- పారిశ్రామిక ప్రోత్సాహం కోసమంటూ పలు విభాగాల్లో ప్రభుత్వం నియమించిన కొంతమంది ప్రత్యేక అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ...

ఇప్పటివరకు  ఏంచేశారు

  • ఏయే కంపెనీలతో భేటీ అయ్యారు?

  • ఎంవోయూల వరకు ఏమైనా వచ్చాయా?

  • పరిశ్రమల శాఖ ప్రత్యేకాధికారులతో సీఎస్‌

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలు- పారిశ్రామిక ప్రోత్సాహం కోసమంటూ పలు విభాగాల్లో ప్రభుత్వం నియమించిన కొంతమంది ప్రత్యేక అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పరిశ్రమల శాఖ పురోగతిపై ఇటీవల ఆ శాఖ అధికారులతో పాటు పలు సెక్టార్ల ప్రతినిధులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విభాగాల ప్రతినిధుల పనితీరు, నివేదికలపై చర్చ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘మీరు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేశారో చెప్పండి. ఏయే కంపెనీలతో భేటీ అయ్యారు? ఎంవోయుల వరకు ఏమైనా వచ్చాయా? అసలు పరిశ్రమలు-వాణిజ్య శాఖను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలేంటి?’ అని నిలదీసినట్లు తెలిసింది. ఇదే అంశంపై 15 రోజుల్లో సమావేశం ఉంటుందని.. ఆలోగా పూర్తి వివరాలివ్వాలని సూచించినట్టు తెలిసింది. పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం 2025 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆరుగురు వ్యక్తులను పలు విభాగాల్లో వివిధ హోదాల్లో రెండేళ్ల కాలపరిమితితో నియమించింది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.18 లక్షలకు పైగా వేతనం ఇస్తోంది. అయినా, సంబంధిత విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎస్‌ సమావేశంతో స్పష్టమైందనే చర్చ జరుగుతోంది. ఏడాదికి రూ.21.60 లక్షల ప్యాకేజీతో లాజిస్టిక్స్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ను, టీ-సిగ్‌ అనే విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఏడాదికి రూ.18 లక్షల ప్యాకేజీతో ఒకరిని, టీజీఐహెచ్‌సీఎల్‌-వైస్ ప్రెసిడెంట్‌గా ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో మరొకరిని 2025 అక్టోబరు 10న ఒకేరోజు నియమించారు. 2025 డిసెంబరు 16న ఏడాదికి 48 లక్షల ప్యాకేజీతో లైఫ్‌ సైన్సెస్‌- డైరెక్టర్‌గా మరొకరిని నియమించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏడాదికి రూ.27 లక్షల ప్యాకేజీతో ఆటోమోటివ్స్‌, ఈవీ-ఈఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఒకరిని, ఫిబ్రవరి 6న ఏడాదికి రూ.18 లక్షల ప్యాకేజీతో ఎంఎ్‌సఎంఈ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఒకరిని నియమించారు.

Updated Date - May 19 , 2026 | 05:22 AM