Share News

Internet Connection: సర్కారీ ఇంటర్‌నెట్‌ను వాడేదెప్పుడు..

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:10 AM

రాష్ట్ర ఖజానాకు భారంగా మారిన ఆర్థిక అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వాటిని ఒక్కొక్కటిగా నియంత్రించే చర్యలు చేపడుతోంది.

Internet Connection: సర్కారీ ఇంటర్‌నెట్‌ను వాడేదెప్పుడు..

  • సొంత భవనాల్లోకి వెళ్లాకైనా వాడతారా!

  • ప్రభుత్వ ఆఫీసులకు నెట్‌ కోసం ఏడాదికి 450 కోట్లు

  • ప్రభుత్వ కార్యాలయాలన్నీ టీ-ఫైబర్‌ ఇంటర్‌నెట్‌

  • కనెక్షన్‌ తీసుకోవాలని 2024 డిసెంబరు 8న జీవో

  • టీ-ఫైబర్‌తో భూ భారతి లోపాలనూ కనిపెట్టే వీలు!

  • అయినా కనెక్షన్‌ తీసుకోని ప్రభుత్వ విభాగాలు

  • 5 శాతం శాఖలు కూడా స్పందించని వైనం

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానాకు భారంగా మారిన ఆర్థిక అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వాటిని ఒక్కొక్కటిగా నియంత్రించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు భవనాల్లో అద్దెకు కొనసాగిస్తున్న ప్రభుత్వ విభాగాలను వెంటనే సొంత భవనాల్లోకి మారాలని ఆదేశించింది. తద్వారా ఏడాదికి రూ.800 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి. కానీ, అద్దె భవనాలకు కిరాయితోపాటు ఆయా కార్యాలయాలకు అవసరమైన ఇంటర్‌నెట్‌ కోసం కూడా అదే స్థాయిలో ప్రభుత్వ విభాగాలు ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరిధిలోని ఇంటర్‌నెట్‌నే వాడుతున్నాయి. ఇందుకోసం ఏడాదికి దాదాపు రూ.450 కోట్లు చెల్లిస్తున్నట్టు ప్రాథమిక అంచనాల్లో తేలిందని సమాచారం. స్టేట్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (స్వాన్‌) కింద 1,057 సంస్థలకు ఇంటర్‌నెట్‌ అందిస్తున్న ఓ కంపెనీకి ఏడాదికి రూ.38 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కేవలం సచివాలయంలో నెట్‌ వినియోగానికే ఏడాదికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఇలా భవనాల అద్దె రూ.800 కోట్లు, ఇంటర్‌నెట్‌ కోసం రూ.450 కోట్లు కలిపి ఏడాదికి రూ.1,250 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తేలింది. అద్దె భవనాలు, ప్రైవేటు ఇంటర్‌నెట్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఉన్నప్పటికీ.. 2020లో ప్రభుత్వ పరిధిలో ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చించి. భారత్‌నెట్‌ ఫేజ్‌-2 కింద ఐటీ, పరిశ్రమల శాఖ పరిధిలోని ‘తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (టీ-ఫైబర్‌) ద్వారా ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ను అందిస్తోంది. 2020 నుంచి ఇది అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వ సంస్థలు ఇప్పటివరకు దీనిని వాడుకోవడంలేదు.


జీవో జారీ చేసినా..

ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రభుత్వరంగ సంస్థలు, అర్బన్‌/రూరల్‌ లోకల్‌ బాడీలు సహా ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలన్నీ ‘టీ-ఫైబర్‌’ ఇంటర్‌నెట్‌ సేవలను తీసుకోవాలని ఆదేశిస్తూ 2024 డిసెంబరు 8న జీవో ఎంఎస్‌ నంబరు 9ని జారీ చేసింది. ప్రభుత్వ పరిధిలోని ఇంటర్‌నెట్‌ కోసం ఆయా శాఖలు, విభాగాల్లో ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను కూడా నియమించాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ/ప్రభుత్వరంగ సంస్థలు సహా మొత్తం 1,86,547 ప్రభుత్వ అనుబంధ విభాగాలు టీ-ఫైబర్‌ ఇంటర్‌నెట్‌ వాడాలని ఆదేశించింది. కానీ, ఆ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటివరకు 5 శాతం ప్రభుత్వ సంస్థలు కూడా ఈ కనెక్షన్‌ తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, ప్రైవేటు భవనాల్లో అద్దెకు కొనసాగుతున్న ప్రభుత్వ విభాగాలన్నీ.. త్వరలో సొంత భవనాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో అప్పుడైనా సర్కారీ ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తారా, లేదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు సొంత భవనాల్లోకి వెళ్తున్న క్రమంలో టీఫైబర్‌ ఇంటర్‌నెట్‌నే వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. తద్వారా ఇంటర్‌నెట్‌ వినియోగం కోసం ప్రస్తుతం చేస్తున్న ఖర్చులో కొంతైనా తగ్గుతుతుందని భావిస్తున్నట్లు సమాచారం.


సైబర్‌ దాడులను తట్టుకునేలా ప్రభుత్వ నెట్‌..

ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోని టీ-ఫైబర్‌ ద్వారా అందిస్తున్న ఇంటర్‌నెట్‌తో ప్రభుత్వ సంస్థలకు ప్రత్యేకంగా ‘వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌’ (వీపీఎన్‌)ను కేటాయిస్తుంది. ఇది పబ్లిక్‌కు ఒకలా, ప్రభుత్వానికి మరోలా పనిచేస్తుంది. తద్వారా ప్రభుత్వ పరిధిలోని వెబ్‌సైట్‌లు, ఇతరత్రా సర్వీసు ప్రొవైడర్లు ఏవీ సైబర్‌ దాడుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. తాజాగా భూ భారతి పోర్టల్‌లో వెలుగుచూసిన లోపాలను కూడా కనిపెట్టే అవకాశం ప్రభుత్వ ఇంటర్‌నెట్‌లో ఉందని, ఆ మేరకు అవసరమైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి కేటాయించిన వీపీఎన్‌లోకి ఎక్కడైనా ఎవరైనా సైబర్‌ రూపంలోగానీ, ప్రైవేటుగా గానీ చొరబడితే వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థ కూడా ఉందని అంటున్నారు. కాగా, ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటి నుంచి పోలీసు శాఖలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, 28 పోలీ్‌సస్టేషన్లు, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌, రైతు వేదికలు, స్త్రీ నిధి, సెర్ప్‌తోపాటు మరికొన్ని విభాగాలు టీ-ఫైబర్‌ ఇంటర్‌నెట్‌ను వాడుతున్నాయి. తాజాగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 10 వేల పాఠశాలలతోపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని కోరుతూ టీ-ఫైబర్‌కు విజ్ఞప్తులు చేశాయని సమాచారం. మొత్తం 1,86,547 ప్రభుత్వ శాఖలు, విభాగాలకు టీ-ఫైబర్‌ కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులు గుర్తించారు.


గ్లోబల్‌ సమ్మిట్‌ కోసం 10 గిగాబైట్ల నెట్‌ అందించిన ‘టీ-ఫైబర్‌’

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌-2025 సదస్సు కోసం 2జీ సిగ్నల్స్‌ కూడా అందుబాటులో లేని ఫ్యూచర్‌ సిటీలో 5జీ సిగ్నల్స్‌ను ‘టీ-ఫైబర్‌’ అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 10 గిగాబైట్ల మేర నెట్‌ను ఎక్కడా చిన్న లోపం లేకుండా అందించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పరిధిలోని ఇంటర్‌నెట్‌ను అన్ని విభాగాలకు టీ-ఫైబర్‌ ద్వారానే అందించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు తెలిసింది. దీనిపై త్వరలో ఆయా శాఖలకు, విభాగాలకు సూచనలు వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42 వేల కిలోమీటర్ల మేర భూగర్భ వైర్ల లైన్‌ను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,86,547 ప్రభుత్వ శాఖలు, విభాగాలకు టీ-ఫైబర్‌ కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులు గుర్తించారు.

Updated Date - Jan 12 , 2026 | 05:11 AM