పాలిటెక్నిక్‌లో చేరండి.. జాబ్ పొందండి
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:28 AM
రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ శనివారం ప్రత్యేక ప్రచారం ప్రారంభించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యాశాఖ ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ శనివారం ప్రత్యేక ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల సిబ్బంది ఆయా పాలిటెక్నిక్‌ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాలిటెక్నిక్ కోర్సు ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించారు. మూడేళ్ల పాలిటెక్నిక్ అనంతరం ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఇందుకు అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇందులో భాగంగా సాంకేతిక విద్యాశాఖ శనివారం ప్రత్యేక ప్రచార పత్రాలు, వీడియోలను విడుదల చేసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిసెట్ కోసం ఏప్రిల్22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రవేశపరీక్ష మే13న ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.