వరి సాగుకు సర్కారు కళ్లెం
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:10 AM
వరి సాగుకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి సీజన్‌లో సగటున 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా...
60 లక్షల ఎకరాల్లో 10 శాతం తగ్గింపుపై దృష్టి
8 రకాలకే రూ.500 బోనస్ పరిమితం
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): వరి సాగుకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి సీజన్‌లో సగటున 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా... ఈసారి కనీసం 10 శాతం(6 లక్షల ఎకరాలు) తగ్గించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. బోనస్ పథకం వర్తింపును 33 రకాల నుంచి 8 రకాలకు తగ్గించింది. ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగును పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పలు వేదికలపై పంటల మార్పిడి ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో వరి సాగును తగ్గించాలని, ఇతర పంటలను సాగుచేయాలని సూచిస్తున్నారు. నీటి వినియోగం, సాగు ఖర్చులు తగ్గుతాయని, కరువును తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని, నేల మరింత సారవంతమవుతుందని, రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని వ్యవసాయశాఖ చెబుతోంది. కందులు, పెసర్లు, మినుముల లాంటి పప్పు ధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడులాంటి నూనె గింజలు, టమాట, మిర్చి, వంగ, బెండ లాంటి కూరగాయల సాగు చేపట్టాలని సూచిస్తోంది. దీర్ఘకాలిక పంటగా పామాయుల్ సాగుపై ప్రచారం చేస్తోంది. ‘ఎల్‌నినో’ ప్రభావాన్ని ఎదుర్కోవటానికి రైతులు సిద్ధంగా ఉండాలని, ఆలస్యపు, అరకొర వర్షాలు వస్తే... ఆరుతడి పంటలు సాగుచేయటమే మేలని సూచిస్తోంది.