భక్తి లేనివారికి భయం కలిగించేందుకే
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:10 AM
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసి, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధమైనభరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం...
కన్నవారిని నిర్లక్ష్యం చేసే కొడుకులను సమాజం నుంచి బహిష్కరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసి, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధమైనభరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం-2026’ బిల్లును రాష్ట్ర శాసనసభ ఆదివారం ఆమోదించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సంరక్షణపై సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. పురాణ కాలపు శ్రవణ కుమారుడి మాతృ, పితృభక్తిని గుర్తుచేసి.. ఆధునిక కాలపు పారిశ్రామిక వేత్త విజయ్‌పథ్ సింఘానియా విషాద గాథను ఊటంకించి అందరినీ ఆలోచింపజేశారు. ‘చూపులేని వృద్ధ తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని భుజాలపై మోస్తూ శ్రవణకుమారుడు పుణ్యక్షేత్ర దర్శనానికి తీసుకువెళ్లాడు. ఒకరోజు సరయూ నదీ తీరంలో తల్లిదండ్రుల దప్పిక తీర్చడానికి శ్రవణుడు నదిలో నుంచి నీళ్లు తీసుకుంటుండగా.. ఏదో క్రూర మృగం అని పొరబడిన దశరథ మహారాజు శబ్దభేది బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణం తగిలి శ్రవణుడు మరణించాడు. పుత్రశోకంతో ఆ వృద్ధ దంపతులు నీవు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావు అని దశరథుడిని శపిస్తారు’ అని సీఎం వివరించారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు అవసరం లేదని అన్నారు. రూ.వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రేమండ్స్ కంపెనీ మాజీ అధినేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్‌పథ్ సింఘానియా విషాదాంతాన్ని కూడా గుర్తు చేశారు. ‘వ్యాపారవేత్తగా విజయవంతమైన సింఘానియా చివరికి కొడుకు చేసిన ద్రోహంతో అనామకుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. తన జీవితకాల కష్టార్జితాన్ని పోగుచేసి సుమారు రూ. 1,000 కోట్ల విలువైన కంపెనీని కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగిస్తే.. ఆస్తి చేతికి రాగానే కొడుకు తండ్రిని నిర్లక్ష్యం చేశాడు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక ‘జేకే హౌస్’ నుంచి బయటకు వెల్లగొట్టాడు. దీంతో ఆయన ముంబైలో ఒక సాధారణ అద్దె ఇంట్లో నివసిస్తూ.. ఖర్చులకు డబ్బు కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుర్భర స్థితికి చేరుకున్నారు.
పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి పెద్ద తప్పు చేశానని.. ఏ తండ్రీ తనకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదని ఆయన తన ఆత్మకథ యాన్‌ఇన్‌కంప్లీట్ లైఫ్‌లో వివరించారు’ అని సీఎం గుర్తు చేశారు. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టమని, వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా కీలకముందడుగు అని చెప్పారు. ‘అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు’ అని అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం సమాజానికి శ్రేయస్కరం కాదని సీఎం అన్నారు. ‘వృద్ధుల భద్రత కోసం ఈ చట్టబద్ధ కవచం అవసరం. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు.. చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదకరం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనేవారు. అప్పుడు ఒకరు కాకపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకునేళ్లు. ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణతో ఒకరిద్దరు పిల్లలనే కంటున్నారు. కొడుకు, కూతురు ఇద్దరూ సమానమే. ఆడబిడ్డలకు తల్లిదండ్రులపై ప్రేమ ఉన్నా, మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారు. నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే నిర్లక్ష్యం చేశారు. ఇటీవలే ఆ తండ్రి మరణించారు.తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం నుంచి బహిష్కరించాలి. ఒక సామాజిక బాధ్యతగా ఈ బిల్లును తీసుకొచ్చాం. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు. కానీ, వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించడానికే ఈ ప్రయత్నం. ఏ తల్లి దండ్రులూ అనాథలుగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెచ్చాం’ అని సీఎం వివరించారు.
పర్యవేక్షణ వ్యవస్థకు చట్టబద్ధ బలం: మంత్రి అడ్లూరి
తమ తల్లిదండ్రుల ఆరోగ్యం, నివాసం, ఆర్థిక భద్రతను పర్యవేక్షించడం ఈ చట్టం ద్వారా ఉద్యోగులకు ఇకపై చట్టబద్ధమైన బాధ్యతగా మారుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. బిడ్డలు నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని, బాధ్యతను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు బిల్లులో చేర్చామని చెప్పారు. వృద్ధులు గౌరవంగా జీవించేందుకు ఈ చట్టం ఒక మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పిల్లలు తమ తల్లిదండ్రులను హింసించకుండా ఈ చట్టం కాపాడుతుందని అన్నారు.