Share News

గిగ్‌ వర్కర్ల భవిష్యత్తుకు భరోసా

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:39 AM

ఎటువంటి రక్షణలేని ప్లాట్‌ఫాం ఆధారిత పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న గిగ్‌ వర్కర్లకు భరోసానిచ్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

గిగ్‌ వర్కర్ల భవిష్యత్తుకు భరోసా

  • తెలంగాణ గిగ్‌ కార్మికుల సంక్షేమ బిల్లును ఆమోదించిన రాష్ట్ర మంత్రిమండలి

  • ప్రతి కార్మికుడికీ యునిక్‌ ఐడీ కేటాయింపు

  • ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి పథకాల అమలు

  • బీమా, ఆరోగ్య సేవలు, ప్రమాద సహాయం

  • ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి రక్షణలేని ప్లాట్‌ఫాం ఆధారిత పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న గిగ్‌ వర్కర్లకు భరోసానిచ్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ గిగ్‌ కార్మికుల సంక్షేమ బిల్లు-2026ను రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ఆమోదించింది. దీనిని ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 4.5 లక్షల మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో గిగ్‌, ప్లాట్‌ఫాం ఆధారిత ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్‌, ఓలా, స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌, బ్లింకిట్‌, జెప్టో వంటి ప్లాట్‌ఫారాల ద్వారా లక్షలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. అయితే సకాలంలో ఆర్డర్‌ ఇవ్వాలన్న తొందరలో అనేక మంది ప్రాణాలు పోతున్నా.. అటు కంపెనీల నుంచి గానీ, ఇటు ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సహకారం ఉండడంలేదు. దీంతో వీరి సంక్షేమానికి ప్రత్యేక చట్టం తేవాలని గత కొన్నేళ్లుగా డిమాండ్‌ వస్తోంది. దీనిపై రెండేళ్ల అధ్యయనం అనంతరం.. ఎట్టకేలకు బిలు రూపుదిద్దుకొని మంత్రిమండలి ఆమోదం పొందింది.

బిల్లులోని ముఖ్యాంశాలు ఇవీ..

  • తప్పనిసరి రిజిస్ట్రేషన్‌: ప్రతి గిగ్‌ వర్కర్‌కు యునిక్‌ ఐడీ ఇచ్చి, ప్రభుత్వ డేటాబే్‌సలో నమోదు చేయడం.

  • సంక్షేమ బోర్డు ఏర్పాటు: ప్రభుత్వం, కార్మికులు, అగ్రిగేటర్ల ప్రతినిధులతో కూడిన వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు.

  • సంక్షేమ నిధి: గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ‘సోషల్‌ సెక్యూరిటీ ఫండ్‌’ ఏర్పాటు చేసి, దాని ద్వారా పథకాల అమలు.

  • స్విగ్గీ, ఉబర్‌ వంటి కంపెనీలపై కార్మికుల సంక్షేమ ఫండ్‌ ఫీజు

  • సామాజిక భద్రత పథకాలు: బీమా, ఆరోగ్య సేవలు, ప్రమాద సహాయం వంటి పథకాలు అందించడం.

  • ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ: గిగ్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ.

  • అల్గారిథమ్‌ పారదర్శకత: యాప్‌లలో తీసుకునే నిర్ణయాలు (ఆర్డర్లు, రేటింగ్స్‌) పారదర్శకంగా ఉండేలా నియంత్రణ.

  • పర్యవేక్షణ-అమలు: చట్టం అమలుకు ప్రత్యేక మానిటరింగ్‌ వ్యవస్థ.


చనిపోయినా అడిగే నాథుడే లేడు

గిగ్‌ ఎకానమీ అంటే స్థిరమైన ఉద్యోగం కాకుండా.. తాత్కాలిక లేదా డిమాండ్‌ ఆధారిత పనులు చేయడం. ఇది యువతకు ఉపాధి అవకాశాలను పెంచినప్పటికీ అనేక సమస్యలను కూడా తెచ్చింది. స్థిరమైన జీతం లేకపోవడం, పని గంటలపై నియంత్రణ లేకపోవడం, ప్రమాద సమయంలో బీమా లేకపోవడం, సంస్థల నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం వంటి పరిస్థితుల్లో గిగ్‌ వర్కర్లు పనిచేయాల్సి వస్తోంది. దీంతో అనేక మంది తీవ్ర ప్రమాదాల బారిన పడి చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. అయితే కార్మికులు మృతి చెందిన అనంతరం అటు కంపెనీలు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఆదుకున్న దాఖలాలు లేవు. గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, వారికోసం ప్రత్యేక చట్టం తెస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు కొత్త బిల్లు సిద్ధమైంది.

Updated Date - Mar 24 , 2026 | 05:39 AM