ఇకపై అడిషనల్ డీఎంఈలందరికీ శిక్షణ
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:55 AM
వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలో అడిషనల్ డీఎంఈలకు పరిపాలనలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నేటి నుంచి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలో అడిషనల్ డీఎంఈలకు పరిపాలనలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు ఈ శిక్షణ ఉంటుంది. భవిష్యత్తులో అదనపు వైద్య విద్య సంచాలకులుగా పదోన్నతి పొందాక అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఐదు రోజులు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటిదాకా వారికి పాలనపరమైన అనుభవం లేకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణపై పట్టురావడం లేదు. ఫలితంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అడిషనల్ డీఎంఈ హోదా పొందిన వారందరికీ పరిపాలనలో శిక్షణ ఇవ్వడాన్ని వైద్యశాఖ తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని 35 మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, వాటి అనుబంధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఈ శిక్షణనివ్వనున్నారు. ఇందులో పరిపాలన, నిబంధనలు, ఆర్థిక వ్యవహారాలు, డిజిటల్ పరిపాలన తదితరాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. కాగా వైద్య సేవలు, శస్త్రచికిత్సల్లో ఎంతో నైపుణ్యం ఉన్నా పరిపాలన విషయంలో మంచి పట్టు ఎంతో అవసరమని, అడిషనల్ డీఎంఈగా పదోన్నతులు పొందిన వారందరికి ఇక నుంచి పరిపాలనలో శిక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు.