నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్!
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:48 AM
రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించనుంది.
క్యాన్సర్ రిజిస్ట్రీ కూడా ఏర్పాటు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించనుంది. అలాగే, క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదైనా వ్యాధిని నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటిస్తే.. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు క్యాన్సర్ నిర్ధారణైతే వైద్య శాఖకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. సాధారణంగా అంటు వ్యాధులను ప్రభుత్వాలు నోటిఫైడ్ డిసీజ్‌లుగా ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రులు మాత్రమే క్యాన్సర్ కేసుల వివరాలను వైద్యశాఖకు ఇస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటిస్తే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ప్రభుత్వానికి విధిగా సమాచారం ఇవ్వాలి. దీంతో ప్రభుత్వం వద్ద క్యాన్సర్ కేసుల గణాంకాలు పక్కాగా ఉంటాయి.
క్యాన్సర్ రిజిస్ర్టీ అంటే ఏమిటి?
క్యాన్సర్ రిజిస్ర్టీ అంటే.. ఒక ఆస్పత్రిలో నమోదయ్యే క్యాన్సర్ కేసుల సమాచారాన్ని (వ్యాధి రకం, రోగి వయసు, నివసించే ప్రాంతం, చికిత్స విధానం మొదలైనవి) సేకరించి, నిక్షిప్తం చేసే వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల అనేక ఉపయోగాలుంటాయి. రిజిస్ట్రీకి వచ్చే సమాచారం ఆధారంగా వ్యాధి తీవ్రతను గుర్తించడమే కాక ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకోవచ్చు. క్యాన్సర్‌ను గుర్తించేందుకు, కారణాల విశ్లేషణకు రిజిస్ట్రీలోని సమాచారం ఉపయోగపడుతుంది. ఈ విశ్లేషణలు, పరిశోధనల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎక్కువ ఆస్పత్రులు, స్ర్కీనింగ్ సెంటర్లు అవసరమో ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే చికిత్స అనంతరం రోగుల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో కూడా సులభంగా పర్యవేక్షించవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ రిజిస్ట్రీలు కొన్ని ఆస్పత్రుల నుంచే సమాచారం తీసుకుంటున్నాయి. ప్రభుత్వం క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటిస్తే.. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల నుంచి రిజిస్ట్రీకి సమాచారం అందుతుంది. అప్పుడు క్యాన్సర్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.
దేశంలో క్యాన్సర్ రిజిస్ట్రీ, నోటిఫైడ్ స్థితి
ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్‌సీడీఐఆర్ (నేషనల్ సెంటర్ ఫర్ డిసిజ్ ఇన్ఫోమేటిక్ అండ్ రీసెర్చ్) ఆధ్వర్యంలో దేశంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ర్టీ ప్రోగ్రామ్ (ఎన్‌సీఆర్‌పీ) నడుస్తోంది. అయితే, దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం బలమైన రిజిస్ర్టీలు ఉన్నాయి. కానీ రెండు రాష్ట్రాలు క్యాన్సర్‌ను ఇప్పటిదాకా నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించలేదు. ఇటీవల రాజ్యసభ కమిటీ కూడా క్యాన్సర్‌ను దేశవ్యాప్తంగా నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించాలని సిఫారసు చేసింది.
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో డేటా
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొత్తగా నిర్ధారణ అయిన క్యాన్సర్ కేసుల వివరాలను ప్రభుత్వ క్యాన్సర్ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు. ఆ వివరాలన్నీ హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి చేరుతాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల వివరాలు ఎంఎన్‌జేలోని రిజిస్ట్రీలో ఉంటాయి. కాగా, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
డేటాతో పరిశోధన, పాలసీ, చికిత్స విధానాలు
క్యాన్సర్ రిజిస్ట్రీతో ఏ జిల్లాలో ఏ రకమైన క్యాన్సర్ కేసులు వస్తున్నాయో గుర్తించవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి రిజిస్ట్రీకి వచ్చిన డేటా ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేయవచ్చు. విధాన నిర్ణయాలు, నివారణ చర్యలతో పాటు క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట స్ర్కీనింగ్ పెంచడం, చికిత్సా పద్ధతులను మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు. దీంతో పాటు రోగుల ఆధార్‌ను లింక్ చేయడం వల్ల రోగుల సంఖ్యలో పొరపాట్లు జరగవు
- డాక్టర్ ఎం. శ్రీనివాసులు, మాజీ డైరెక్టర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, హైదరాబాద్.