జోన్లవారీగా ‘అపాయింటింగ్ అథారిటీలు’
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:39 AM
రాష్ట్ర పోలీసు శాఖలోని కిందిస్థాయి పరిపాలనా (మినిస్టీరియల్) సిబ్బంది నియామకానికి జోన్లవారీగా ప్రభుత్వం అపాయింటింగ్ అథారిటీలను నిర్ధారించింది...
పోలీసుశాఖలో పరిపాలనా సిబ్బంది నియామకంపై ఉత్తర్వులు
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు శాఖలోని కిందిస్థాయి పరిపాలనా (మినిస్టీరియల్) సిబ్బంది నియామకానికి జోన్లవారీగా ప్రభుత్వం అపాయింటింగ్ అథారిటీలను నిర్ధారించింది. ఏ జిల్లాలోని పోస్టులను ఏ జోనల్ ఉన్నతాధికారి నియమించాలన్న అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2018లోనే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించింది. ఆ తర్వాత నారాయణపేట, ములుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను రెండోసారి సవరించింది. అయితే, ఈ జిల్లాలు, కొత్త జోన్లకు అనుగుణంగా పోలీసు శాఖలో సూపరింటెండెంట్లు, స్పెషల్ క్యాటగిరీ స్టెనోగ్రాఫర్లు, మేనేజర్లు, సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు తదితర మినిస్టీరియల్ సిబ్బంది నియామక అథారిటీను ఖరారు చేయలేదు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల నియామక అథారిటీలే మనుగడలో ఉన్నాయి. తాజాగా ‘ది తెలంగాణ మినిస్టీరియల్ సర్వీసెస్ రూల్స్-1998’లోని రూల్ 4, రూల్ 13లను సవరించి... ఆయా జోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాల గ్రూపులు, వాటిలోని మినిస్టీరియల్ సిబ్బంది నియామక అథారిటీలను ఖరారు చేశారు. దీని ప్రకారం ఓ జోన్ పరిధిలోని జిల్లాల గ్రూపులో ఏర్పడే మినిస్టీరియల్ పోస్టులను నిర్దేశిత అపాయింటింగ్ అథారిటీయే భర్తీ చేస్తుంది.