ఎస్‌బీఐకి బైబై?
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:16 AM
రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం వేసిన భూముల విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది.
రాయదుర్గం భూముల వేలం విషయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం
ఆ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల వివరాలు ఇవ్వండి
శాఖల ఉన్నతాధికారులకు సందేశం
ప్రభుత్వానికి చేరిన అన్ని శాఖల వివరాలు
వాటన్నింటినీ ఉపసంహరించి, మరో బ్యాంకుకు బదిలీ చేసే ఆలోచన!
ఎస్‌బీఐకి ‘లీడ్ బ్యాంకు’ హోదా కూడా తొలగించే యోచనలో సర్కారు?
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం వేసిన భూముల విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల వేలం వేసిన ఈ భూములకు ఎకరానికి రూ.237 కోట్ల రికార్డు ధర పలకగా.. వేలం ప్రక్రియ ముగిశాక ఆ భూములు తమవేనంటూ హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..ఎస్‌బీఐకి ఝలక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి ఎస్‌బీఐలో చేస్తున్న అన్ని లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్‌బీఐకి ఉన్న ‘లీడ్ బ్యాంకు’ హోదాను కూడా తొలగించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగుల జీతాలు, పీఎ్‌ఫలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కార్పొరేషన్లు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు సహా ఇతరత్రా లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య, ఉన్నతాధికారుల సెల్‌ఫోన్‌లకు శక్రవారం ఉదయం సందేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు దాదాపు అన్ని శాఖలకు చెందిన లావాదేవీలు, నిధుల వివరాలన్నీ ప్రభుత్వానికి హుటాహుటిన చేరినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. వాటిని పరిశీలించాక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఎస్‌బీఐ నుంచి లావాదేవీలను ఉపసంహరించుకుని, మరో జాతీయ గుర్తింపు పొందిన, ప్రభుత్వ బ్యాంకుకు బదిలీ చేయాలనే భావనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.
రైతు రుణాల విషయంలోనూ అసంతృప్తి..
టీజీఐఐసీ భూముల విషయంలో వ్యవహరించిన తీరు సరిగా లేకపోవడంతోపాటు రైతు రుణాల విషయంలోనూ ఎస్‌బీఐ ఆశించిన మేరకు పనితీరు కనబరచడంలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి బ్యాంకు పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఆ కారణంగానే ఎస్‌బీఐలో ప్రభుత్వం జరుపుతున్న అన్ని లావాదేవీల నుంచి వైదొలగాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ప్రభుత్వం రూ.వేల కోట్ల లావాదేవీలు జరుపుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఈ బ్యాంకులోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం.. ఓ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.75 కోట్లు ఓ అకాడమీకి సంబంధించి రూ.80 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, అలాగే మరో సంస్థ పరిధిలో సుమారు రూ.300 కోట్ల లావాదేవీలు ఉన్నాయని తేలింది. ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు, వర్సిటీలు, ప్రభుత్వ సంస్థల లావాదేవీలన్నీ కోట్లలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వీటన్నింటి నుంచి వైదొలగే యోచనలో ప్రభుత్వం ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
ఇదీ వివాదం..
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఐదు ఎకరాల ప్లాటు (20,239 చదరపు మీటర్లు) ప్లాట్ నంబర్ 1(ఏ)ను టీజీఐఐసీ ఇటీవల వేలం వేసింది. అయితే వేలానికి ముందు ఇచ్చిన ప్రకటనల సమయంలోగానీ, వేలం నిర్వహించే సమయంలోగానీ స్పందించకుండా వేలం పూర్తయ్యాక ఆ భూములు తమవేనంటూ ఎస్‌బీఐ హైకోర్టులో పిటిషన్ వేసిందని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి సదరు ఐదెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వమే తమకు విక్రయించిందని, ఉమ్మడి రాష్ట్రంలోనే 2010లోరూ.13.33 కోట్లకు తాము కొనుగోలు చేశామని, ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం జరిగినట్లు కోర్టులో వేసిన పిటిషన్‌లో బ్యాంకు పేర్కొంది. ఆ ఒప్పందంలో తిరిగి భూమిని తీసుకునేలా ఎలాంటి నిబంధనలు లేవని తెలిపింది. అయితే ఇటీవల (మే 20న) సదరు భూమిలో తాము నిర్మాణాలు చేపట్టనందుకు కేటాయింపును రద్దు చేస్తున్నామంటూ ప్రభుత్వం లెటర్ జారీ చేసిందని, కానీ.. ఆ లెటర్ తమకు అందలేదని పేర్కొంది. నిర్మాణాలు పూర్తిచేయడానికి సమయం ఇవ్వాలని కోరినప్పటికీ తిరస్కరించారని ఎస్‌బీఐ తెలిపింది. అయితే.. వేలం ప్రక్రియకు ముందుగానే 5 ఎకరాలను వేలం వేస్తున్నామని, దానికి ప్రత్యామ్నాయంగా అదే ప్రాంతంలో మరోచోట 2.30 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకుకు తెలిపింది. ఇందుకు తెలంగాణ రీజియన్‌కు చెందిన ప్రతినిధులు మౌఖికంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. కానీ, ఆ తరువాత ఎస్‌బీఐ ఉన్నతాధికారులు దానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ కారణంగానే మొదట ప్రభుత్వం మరోచోట ఇస్తామన్న 2.30 ఎకరాల ప్రతిపాదనను పక్కనబెట్టి, వేలం వేసిన భూములు తమవేనని, ఎవరికీ హక్కులు ఉండవంటూ బ్యాంకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని సమాచారం. అయితే వేలం ప్రక్రియ పూర్తయ్యాక బ్యాంకు ఎందుకు స్పందించిందన్న అనుమానాలు ఉత్పన్నవమడంతో ప్రభుత్వం దీనిపై ఆరా తీసినట్లు, ఈ క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.