Share News

2 డీఏల విడుదలకు సర్కారు మొగ్గు!

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:14 AM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది! రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగ వర్గాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది.

2 డీఏల విడుదలకు సర్కారు మొగ్గు!
prc

  • 2 డీఏల విడుదలకు సర్కారు మొగ్గు!

  • ఒకటి, రెండు నెలల్లోనే పీఆర్సీ అమలు

  • బకాయిల చెల్లింపు రూ.2వేల కోట్లకు

    పెంచాలంటున్న ఉద్యోగ సంఘాలు

  • ఈ అంశాన్నీ పరిశీలిస్తున్న ప్రభుత్వం

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో

    నేడు కీలక ప్రకటన?

    హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది! రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగ వర్గాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాల్లో (డీఏ) ప్రాథమికంగా రెండింటిని వెంటనే విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మిగిలిన డీఏలను ప్రతిపాదిత పీఆర్సీలో కలిపి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే పీఆర్సీ కమిషన్‌ నివేదికను తెప్పించి, రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లోనే వేతన సవరణను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల పాత బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత పది నెలలుగా నెలకు రూ.1,000 కోట్ల చొప్పున విడుదల చేస్తున్న నిధులను రూ.2,000 కోట్లకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీని ద్వారా ఉద్యోగులకు రూ.1,000 కోట్లు, పెన్షనర్లకు రూ.1,000 కోట్లు కేటాయించాలని కోరుతున్నాయి. సంక్షేమ పథకాల వ్యయాన్ని సైతం సర్దుబాటు చేస్తూ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఈ నెలవారీ నిధుల కేటాయింపును మరికొంత పెంచేందుకు అంగీకరించినట్లు తెలిసింది.


పీఆర్సీ, సీపీఎస్‌ రద్దుపై స్పష్టత

మరోవైపు పీఆర్సీ నివేదిక కోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజూ, కమిషన్‌కు లేఖ రాశారు. ఉద్యోగులు 51 శాతం ఫిట్‌మెంట్‌ డిమాండ్‌ చేస్తుండగా, ప్రభుత్వం ఎంత శాతం ప్రకటిస్తుందనే ఆసక్తిగా మారింది. ఇక సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌) రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించేందుక మూడు నెలల కాలల పరిమితితో ప్రభుత్వం ఇదివరకే ఒక కమిటీని వేసింది. నిర్ణీత గడువులోగా నివేదిక తెప్పించుకుని ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. గత కొంతకాలంగా పెండింగ్‌ డీఏలు, ఆరోగ్య పథకం, సీపీఎస్‌ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో క్షేత్రస్థాయిలోని 13.31 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. డిమాండ్ల సాధనలో విఫలమైతే నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలనే రీతిలో ఒత్తిడి పెరుగుతుండటంతో ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణను తీవ్రతరం చేసింది.

నేడు సీఎం సమక్షంలో కీలక నిర్ణయాలు!

ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సీఎస్‌ సంజయ్‌ జాజూ నేతృత్వంలో జరగాల్సిన ఉద్యోగ సంఘాల సమావేశం వాయిదా పడింది. ప్రభుత్వ నిర్ణయాలను నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలోనే ప్రకటించాలని జేఏసీ కోరడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నాం 2 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. పీఆర్సీ అమలు, డీఏల విడుదల, సీపీఎస్‌ రద్దుపై ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - Sep 23 , 2026 | 07:14 AM