Share News

నియోజకవర్గానికి 1000 కుట్టుమిషన్లు

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:18 AM

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల(బీసీ) మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభు త్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నియోజకవర్గానికి 1000 కుట్టుమిషన్లు

  • రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల అత్యాధునిక కుట్టు మిషన్ల పంపిణీకి జీవో జారీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల(బీసీ) మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభు త్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ‘ఆటోమేటిక్‌ కుట్టు మిషన్ల’ పంపిణీ పథకాన్ని అమ లు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు(జీవోఎంఎస్‌ నెం.1) జారీ చేసింది. ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యిమంది మహిళలను ఎంపిక చేసి ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకు తెలంగాణ బీసీ సహకార ఆర్థిక సంస్థ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరిస్తూ.. ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశించింది. ఈ పథకం అమలుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, అర్హత ప్రమాణాలకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలను రూపొందించాలని బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ప్రభు త్వం ఆదేశించింది. కుట్టు మిషన్ల సాంకేతిక ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ-టెండరింగ్‌ ద్వారా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బీసీ మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి, వారిని నైపుణ్యం గల కుట్టు పనివారిగా మార్చడానికి ఈ ఆటోమేటిక్‌ మిషన్లు ఎంతో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతితో వెలువడిన ఈ ఉత్తర్వుల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ : మంత్రి పొన్నం

రాష్ట్రంలోని బలహీన వర్గాల మహిళలు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే ప్రభు త్వం లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యిమంది చొప్పున 100 శాతం రాయితీతో ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు బలహీనవర్గాల మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి దరఖాస్తులను ఆహ్వానిస్తామని, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 05:18 AM