Share News

ఒప్పంద కాలంలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నష్టాలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:24 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సహకరించాలని నిర్మాణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఒప్పంద కాలంలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నష్టాలు

  • నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం వల్లే భారీ సీపేజీలు

  • పునరుద్ధరణ ఖర్చులను నిర్మాణ సంస్థలు భరించాల్సిందే

  • పనులకు సహకరించుకుంటే కఠిన చర్యలు తప్పవు

  • అఫ్కాన్స్‌, నవయుగ సంస్థలకు ప్రభుత్వ నోటీసులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సహకరించాలని నిర్మాణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థలు అఫ్కాన్స్‌(అన్నారం), నవయుగ(సుందిళ్ల) సంస్థలకు నోటీసులు పంపింది. ఒప్పంద కాలంలోనే బ్యారేజీలకు నష్టాలు జరిగాయని, అందువల్ల పునరుద్ధరణ ఖర్చులను నిర్మాణ సంస్థలు అఫ్కాన్స్‌(అన్నారం), నవయుగ(సుందిళ్ల) భరించాల్సిందేనని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసి వాటిని ప్రభుత్వానికి ఇప్పటిదాకా నిర్మాణ సంస్థలు అప్పగించలేదని గుర్తు చేసింది. బ్యారేజీల పునరుద్థరణకి అవసరమైన పరిశోధనలు, తదనంతర పునరుద్థరణ చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), డిజైన్‌ కన్సల్టెంట్‌లకు సంపూర్ణ సహకారం అందించాలని ఆదేశించింది. దీనికోసం సిబ్బంది, సామగ్రి, యంత్రాలను బ్యారేజీ వద్దకు తరలించాలని తెలిపింది. సహకారం అందించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పునరుద్థరణ చర్యల్లో నేషనల్‌ డ్యామ్‌ ేసఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎ్‌సఏ), జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నీటిపారుదల శాఖ నియమించే డిజైన్‌ కన్సల్టెంట్‌ నుంచి అవసరమైన వివరాలు అందిన వెంటనే బ్యారేజీల పునరుద్థరణకి సహకారం అందిస్తామని నిర్మాణ సంస్థలు పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం నోటీసుల్లో ప్రస్తావించింది. పునరుద్థరణ పనుల డిజైన్ల తయారీ కోసం ఆఫ్రీ ఇండియా(ముంబై) సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశామని పేర్కొంది. బ్యారేజీల్లో భారీగా సీపేజీలు కలగడానికి నిర్మాణ సంస్థలే కారణమని స్పష్టం చేసింది. ఒప్పందంలోని సంబందిత నిబంధనలను ఉటంకిస్తూ తాము ఎప్పటికప్పుడు లేఖలు రాసినా, నిర్మాణ సంస్థలు లోపాలను సరిచేయడంలో విఫలమయ్యాయని తెలిపింది. దాంతో బ్యారేజీల్లో సీపేజీలు బయటపడి, వినియోగించడానికి వీల్లేకుండా పోయాయని పేర్కొంది. తక్షణమే పునరుద్ధరణ డిజైన్లు అందించే సంస్థలకు, పరీక్షలు చేసే సీపీడబ్ల్యూఆర్‌ఎ్‌సకు సహకరించాలని ఆయా సంస్థలకు స్పష్టం చేసింది.

Updated Date - Feb 20 , 2026 | 01:24 AM