ఆర్డీవో పరిధిలోనే ‘సాదాబైనామా’కు పరిష్కారం!
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:22 AM
సాదాబైనామా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. భూభారతి నిబంధనల్లో స్వల్పంగా సవరణలు చేస్తూ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది..
విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందే..
నూతన మార్గదర్శకాలు
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్ర జ్యోతి): సాదాబైనామా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. భూభారతి నిబంధనల్లో స్వల్పంగా సవరణలు చేస్తూ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. భూభారతి చట్టం నిబంధన-3, సెక్షన్-3కి సవరణ చేయడం, ఆర్డీవో పరిధిలోనే సమస్య పరిష్కారం, విక్రయదారు నుంచి అఫిడవిట్ తప్పనిసరి చేయడం, కొనుగోలు చేసిన వ్యక్తి తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసుతోపాటు ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులను నిలిపివేడయం వంటి పలు అం శాలను కొత్త మార్గదర్శకాల్లో చేర్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 9,00,880 దరఖాస్తులు ఉంటే వాటిలో 8,99,032 దరఖాస్తులకు నోటీసులు జారీ చేశారు. ఇంకా 1848 దరఖాస్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు పంపినవి 32,030 మాత్రమే. ఇందులోకేవలం 5,295 దరఖాస్తులనే ఆమోదించగా.. 26,735 అపరిష్కృతంగా ఉన్నాయి. తహసీల్దార్ నుంచి ఆర్డీవోకు వెళ్లిన దరఖాస్తుల్లో కేవలం 17 శాతమే ఆమోదించారు.
అత్యధిక దరఖాస్తులు ఖమ్మం జిల్లా నుంచే
సాదాబైనామా దరఖాస్తుల్లో ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 1,11,442 వచ్చాయి. అయితే, ఈ జిల్లాలో తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు వెళ్లిన దరఖాస్తులు 51 మాత్రమే. ఇందులో ఏ ఒక్క దరఖాస్తునూ ఆమోదించలేదు. సూర్యాపేట జిల్లాలో 81,626 దరఖాస్తులు రాగా 491 మాత్రమే తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవోకు పంపారు. వాటిలో 65 ఆమోదించగా 426 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఒక్క దరఖాస్తు కూడా ఆమోదించని జిల్లాల జాబితాలో రంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, వికారాబాద్, నిర్మల్, హనుమకొండ, వరంగల్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, భద్రాది కొత్తగూడెం, ములుగు, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, ఖమ్మం ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 5541 దరఖాస్తులు రాగా అందులో తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు 69 దరఖాస్తులను పంపారు. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 53,996 దరఖాస్తులు వస్తే తహసీల్దార్ నుంచి ఆర్డీవోకి వెళ్లింది కేవలం ఒక్క దరఖాస్తే. అదీ పెండింగ్‌లోనే ఉంది. సిద్దిపేట జిల్లాలో 44,583 దరఖాస్తులు రాగా 11652 దరఖాస్తులు తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు వెళ్లాయి. 8832 పెండింగ్‌లో పెట్టారు. 2,820 ఆమోదించారు. అత్యధిక దరఖాస్తులు ఆమోదించిన జిల్లా ఇదొక్కటే. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది.