Share News

పాత బిల్లుల చెల్లింపుపై మార్గదర్శకాలు జారీ

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:12 AM

గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పెండింగ్‌ బిల్లులకు చెల్లింపులపై సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది.

పాత బిల్లుల చెల్లింపుపై మార్గదర్శకాలు జారీ

  • ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పెండింగ్‌ బిల్లులకు చెల్లింపులపై సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో పాత, కొత్త సర్పంచ్‌ల మధ్య వివాదం నెలకొందంటూ ‘‘కేంద్ర నిధులపై ‘పంచాయితీ’’’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క ఆదేశాలతో ఆ శాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మేరకు పీఆర్‌ డైరెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ బుధవారం అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీఓ, డీఎల్‌పీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్లుల చెల్లింపులపై ఆమె స్పష్టతనిచ్చారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి టైడ్‌ కాంపొనెంట్‌ కింద రూ.245 కోట్లు, అలాగే 2024-25కి గాను బేసిక్‌ అన్‌టైడ్‌, టైడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.640.07 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత సర్పంచ్‌ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగిసిందని.. ఈ నేపథ్యంలో 2023-24 కాలంలో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకే పాత సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టంచేశారు. గత నెల 19న జారీ చేసిన సర్క్యులర్‌ ద్వారా జిల్లాల పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. కాగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 6 నుంచి 15 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 02:12 AM