వైద్యుల నియామకాల్లో వెయిటింగ్ జాబితా
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:37 AM
సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామక ప్రక్రియలో వెయిటింగ్ లిస్ట్ పద్ధతిని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఎవరైనా వైద్యుడు ఉద్యోగంలో చేరకుంటే తదుపరి మెరిట్ అభ్యర్థికి అవకాశం
అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామక ప్రక్రియలో వెయిటింగ్ లిస్ట్ పద్ధతిని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వెయిటింగ్ జాబితా విధానానికి అనుమతినివ్వాలని కోరుతూ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ) ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. బోర్డు ప్రతిపాదనకు త్వరలోనే ఆమోదం తెలపనుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం.. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టే నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు రాకపోయినా, విధుల్లో చేరకపోయినా ఆ ఖాళీలు అలానే ఉండిపోతున్నాయి. తదుపరి నోటిఫికేషన్‌లో ఆ పోస్టులను మళ్లీ భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా రకరకాల కారణాలతో కొందరు వైద్యులు విధుల్లో చేరడం లేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనున్నారు. సాధారణంగా కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లోగా సదరు వైద్యుడు లేదా వైద్యురాలు విధుల్లో చేరాలి. ఒకవేళ ఎవరైనా చేరకపోతే వెయిటింగ్ లిస్ట్ విధానం ప్రకారం.. విధుల్లో చేరని అభ్యర్థి కింద ఉన్న తదుపరి మెరిట్ అభ్యర్థికి ఆ ఉద్యోగం ఇస్తారు. ఆ తదుపరి మెరిట్ అభ్యర్థికి కౌన్సిలింగ్ నిర్వహించి వెంటనే పోస్టింగ్ ఇస్తారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్యుల కొరత సమస్య తీరుతుందని అంచనా. వైద్యుల నియామకంలో మాత్రమే వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని అమలు చేస్తారని అంటున్నారు. కాగా, రాష్ట్రంలోని వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిఽధిలోని 1,623 సీఏస్ స్పెషలిస్ట్ పోస్టుల నియామక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది.