Share News

కన్నవారిని కాదంటే జీతంలో కోతే

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:12 AM

ప్రభుత్వ ఉద్యోగులైన పిల్లల ఆదరణకు నోచుకోని వృద్ధులైన తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

కన్నవారిని కాదంటే జీతంలో కోతే

  • ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 కట్‌

  • ఆటోమెటిక్‌గా తల్లిదండ్రుల ఖాతాకు

  • బిల్లుపై నేడు మంత్రివర్గ భేటీలో చర్చ

  • ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ ముందుకు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులైన పిల్లల ఆదరణకు నోచుకోని వృద్ధులైన తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ తల్లిదండ్రులను అనాథలుగా వదిలిస్తే. ఆ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగి వేతనంలో కొంత మొత్తాన్ని నేరుగా ఆ ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాలోకి జమ చేసేలా కొత్త చట్టాన్ని తెస్తోంది. ఈ కోత ఉద్యోగి వేతనంలో 15 శాతం లేదా రూ.10,000గా ఉండనుంది. ఇందుకు సంబంధించి అసోంలో ప్రణామం(పేరెంట్స్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ నార్మ్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌) అనే చట్టం తరహాలో ‘తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ పేరెంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌ (టిఈఏఎంపీఎస్‌)- 2026 అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 309 ప్రకారం.. ఉద్యోగుల ప్రవర్తన, సర్వీసు నిబంధనలపై చట్టం చేసేందుకు ఉండే అధికారాన్ని సర్కారు ఈ దిశగా వినియోగిస్తోంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ టీఈఏఎంపీఎస్‌ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ‘మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007’ పేరుతో ఒక చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం. బాధితులు నేరుగా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి, న్యాయపోరాటం చేయాలి. కేంద్ర చట్టంలో ‘ఆటోమేటిక్‌ జీతం కోత’ విధానం లేదు.


అసోంలో మాత్రమే ప్రమాణం అనే చట్టాన్ని తీసుకొచ్చి, అలాంటి ఉద్యోగుల నెలవారీ వేతనం నుంచి 15శాతం లేదా రూ.10వేలు మొత్తాన్ని కోత విధిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టంలోనూ ఆటోమెటిక్‌ డిడెక్షన్‌ అంశం ఉంది. బాధిత తల్లిదండ్రులు తమ గోడును సంబంధిత శాఖాధిపతికి (హెచ్‌వోడీ)లేదా ప్రభుత్వం నియమించే ప్రత్యేక అఽథారిటీకి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలితే.. సదరు ఉద్యోగి నెలవారీ వేతనం నుంచి నిర్ణీత మొత్తం ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. ఆ సొమ్ము నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ తేనుంది. అయితే, న్యాయశాఖ మాత్రం ప్రస్తుతం కేంద్ర చట్టంలో అమలవుతున్న 10శాతం లేదా రూ.10వేలు కోత విధిస్తే సరిపోతుందని ప్రతిపాదించినప్పటికీ.. ప్రస్తుత ధరల నేపథ్యంలో 15శాతం లేదా రూ.10వేలు (వీటిలో ఏది తక్కువైతే అది) అనే స్వల్ప మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. తల్లిదండ్రులకు ఇద్దరు,ముగ్గురు పిల్లలుండి, వారంతా ప్రభుత్వ కొలువుల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని అందరి జీతాల్లో సమానంగా కోత విధించనుంది.


45 రోజుల్లోగా పరిష్కారం

కేంద్ర చట్టం అమలుకు సంబంధించి ఆర్డీవో స్థాయి అధికారులకు ఉన్న అధికారాలను.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోకి తీసుకొస్తుంది. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సిద్ధం చేస్తుంది. ఒక వేళ కలెక్టర్ల వద్ద కూడా తమకు న్యాయం జరగలేదని బాధితులు అనుకుంటే రిటైర్డు జడ్జి నేతృత్వంలోని కమిషన్‌ను వారు ఆశ్రయించవచ్చు. టీఈఏఎంపీఎస్‌ చట్టం అమల్లోకి వచ్చిన 6-8 నెలల్లో రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సభ్యులుగా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ల వద్ద తమకు న్యాయం జరగలేదనుకుంటే .. బాధితులు కమిషన్‌ను ఆశ్రయించొచ్చు. ఈ కమిషన్‌దే తుది నిర్ణయం. కేవలం ప్రభుత్వ శాఖలే కాకుండా కార్పొరేషన్లు, బోర్డులు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల సిబ్బందికి కూడా ఈ చట్టం వర్తింపచేయనున్నారు. అయితే.. తల్లిదండ్రులకు సొంత ఆదాయం, పెన్షన్‌ లేదా అద్దెలు ద్వారా ఆదాయం ఉండకూడదు. కేవలం పిల్లల మీద ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం ద్వారా రక్షణ లభిస్తుంది.

Updated Date - Mar 23 , 2026 | 06:15 AM