ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, ప్రమాద బీమా
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:46 AM
ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, ప్రమాద బీమా, జీవిత బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రస్తావించింది.
నూతన ఆరోగ్య పథకంపై త్వరలోనే విధివిధానాలు
నగదు రహితం ఎంత వరకు అనే దానిపై ఉద్యోగుల్లో చర్చ
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, ప్రమాద బీమా, జీవిత బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రస్తావించింది. నగదు రహిత చికిత్సతోపాటు ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 23.51లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసే అవకాశముంది. ఈ అంశంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం మరోమారు చర్చించిన అనంతరం మార్గదర్శకాలు జారీ చేస్తుందని అంటున్నారు. అయితే, ఈ పథకం కింద రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులు ప్రమాద వశాత్తు మరణిస్తే రూ.1.25 కోట్ల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల అదనపు కవరేజీ లభించే విధంగా పథకం రూపకల్పన చేశారు. అయితే, నగదు రహిత వైద్యం ఎంత వరకు ఇస్తారు ? అనే చర్చ ఉద్యోగుల్లో ఉంది. వైద్యానికి ఎంత ఖర్చు అయితే అంతా చెల్లిస్తారా ? లేదా పరిమితి విధిస్తారా ? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే, 23.51 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగులను గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగో తరగతి అనే మూడు విభాగాలుగా విభజించే అవకాశముందని ఉద్యోగ సంఘం నాయకులు చెబుతున్నారు. అయితే, అటెండర్ నుంచి గ్రూప్-1 స్థాయి వరకు ఉన్న ఉద్యోగుల్లో ఎవరి వేతనం నుంచి ఎంత తీసుకుంటారు ? వారిని ఏ కేటగిరిలో ఉంచాలి? అనే అంశంపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ చర్చలో కొన్ని శాఖల్లో అటెండర్‌కు, స్వీపర్‌కు కూడా రూ.2 లక్షల వేతనం ఉందని, వేతన స్కేల్ ఆధారంగా ఉద్యోగులను విభజిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఉద్యోగులను గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగోతరగతి కింద మూడు వర్గాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
అలాగే, నగదు రహిత వైద్యం విషయంలో ప్రభుత్వం పరిమితులు విధిస్తుందా ? అనే చర్చ కూడా ఉద్యోగుల్లో ఉంది. ఒక కుటుంబంలో ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులు కలిసి ఐదుగురు ఉంటే.. ఒక్కో వ్యక్తి మీద రూ.10 లక్షల బీమాను వర్తింపజేస్తారా? లేదా కుటుంబం మొత్తానికి రూ.10 లక్షల బీమా వర్తింప జేస్తారా ? అనే సందేహాలు ఉన్నాయి. ఇక, ఈ పథకం కింద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారని అంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తే ఉద్యోగుల్లో ఉన్న ఈ సందేహాలు నివృత్తి అయ్యే అవకాశముంది. ఇక, ఉద్యోగి మూల వేతనంలో 1.5 శాతం మొత్తాన్ని ఆరోగ్య పథకం కింద జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మొత్తం అన్ని క్యాడర్లలో ఒకే విధంగా అమలు చేస్తారా? లేక కేటగిరీ వారీగా విధివిధానాలు ఇస్తారా ? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ విధానంలో ఆ బిల్లులను పొందేవారు. కొత్త పథకం వస్తే ఆ అవసరం లేకుండా నగదు రహిత వైద్యం అందే అవకాశముంది. కాగా, ఉద్యోగుల ఆరోగ్య పథకం పాలనా వ్యవహారాలను మాత్రమే ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షిస్తుందని, మిగిలిన వ్యవహారాలు ఉద్యోగుల ట్రస్టు ఆధీనంలో ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. దీనిపైనా స్పష్టమైన విధివిధానాలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెబుతున్నారు.