Share News

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:45 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

  • ఈ రంగాలకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం

  • నియోజకవర్గాల్లో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు

  • ప్రీ బడ్జెట్‌ సమీక్షలో భట్టి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టంచేశారు. అల్ప సంఖ్యాక వర్గాలు, బీసీ సంక్షేమం, రవాణా, రోడ్లు-భవనాలు, నీటిపారుదల, పౌర సరఫరాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై బుధవారం ఆయన సచివాలయంలో ప్రీ-బడ్జెట్‌ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, అజారుద్దీన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రాధాన్యాలను గుర్తించి, ఆదాయ, వ్యయాలను పక్కాగా అంచనా వేసి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ శాఖలకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులను ఎంత త్వరగా పంపితే అంత త్వరగా క్లియర్‌ చేస్తామని తెలిపారు. వసతి గృహాల భవనాల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టేలా అధికారులు ప్రోత్సహించాలని భట్టి సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రారంభించే ఆలోచన ఉందని డిప్యూటీ సీఎం చెప్పారు.

మహిళలకు మహాలక్ష్మి కార్డులు

బీసీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి బడ్జెట్‌లో ప్రత్యేక పథకాలు ప్రకటించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు త్వరలోనే మహాలక్ష్మి కార్డులను అందిస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కాచిగూడలలోని భారీ భవనాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా రహదారుల నిర్మాణం జరగాలని శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుఽధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో 2026-27 బడ్జెట్‌ ప్రతిపాదనలపై శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో రాష్ట్రంలో అద్దంలాంటి రోడ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌- విజయవాడ (ఎన్‌హెచ్‌-65) రహదారి 8 వరుసల విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని చెప్పారు. హ్యామ్‌ రోడ్ల పనుల కోసం బడ్జెట్‌లో రూ.7 వేల కోట్లు కేటాయించాలని ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి.

Updated Date - Feb 19 , 2026 | 04:46 AM