సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతిని సాధిస్తాం
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:35 AM
సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులోని సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను సాధిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి : భట్టి
ప్రతీ ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం : పొంగులేటి
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులోని సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను సాధిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం, అటవీ సంబంధిత అంశాలకు రూ.200 కోట్లు కావాలని అడిగారని, వాటిని ప్రాధాన్య అంశంగా తీసుకుంటామన్నారు. అలాగే, 15 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవా్‌సరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ హైదరాబాద్‌లోని జలసౌధలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు అవసర మైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించాలని, అంతకంటే ముందు కోర్టు కేసులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల్లో బలమైన వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్‌ను ఢిల్లీలో నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచన చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు మళ్లించే అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. జూలై నెలాఖరు నాటికి అవసరమైన అన్ని అటవీ అనుమతులు పొందాలని మంత్రి ఆదేశించారు. ఇక, సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి ఆటంకంగా మారిన కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్జీటీ క్లియరెన్స్, కోర్టు వివాదాల పరిష్కారానికి అడ్వకేట్ జనరల్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నీటిపారుదల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం ప్రాధాన్య క్రమంలో ఆర్థిక శాఖ బిల్లులను ఎప్పటికప్పుడు ఆమోదిస్తుందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన భూేసకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల పెండింగ్ బిల్లులను జిల్లా కలెక్టర్ల సమన్వయంతో అధికారులు క్లియర్ చేయించుకోవాలని సూచన చేశారు. ఇక, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికతో ముందు కు సాగుతోందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.
74 ఎకరాలు సేకరిస్తే లక్ష ఎకరాలకు సాగునీరు : తుమ్మల
ఎన్జీటీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. 2008లో ప్రారంభమైన వెంకమ్మ చెరువు వరద ప్రవాహ కాలువ ప్రాజెక్టుకు సంబంధించి 72ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.8కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్థరణ పనులకు అవసరమైన రూ.3.20కోట్ల ఆర్థిక అనుమతి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏపీ ప్రభుత్వం విడుదల చేయాల్సిన రూ.16కోట్ల వాటాను త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యాటలకుంట టన్నెల్--సత్తుపల్లి ట్రంక్ కాలువ పనుల్లో భాగంగా నాగుపల్లి గ్రామ పరిధిలో 74 ఎకరాల భూసేకరణకు సంబంధించి కోర్టు వివాదాలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ 74 ఎకరాల భూసేకరణ పూర్తయితే ఈ సాగు సీజన్‌లోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను రెండు నెలల్లో పూర్తి చేసి సంబంధిత శాఖలకు భూములను అప్పగించాలన్నారు.