Share News

అల్పాహారం.. మధ్యాహ్న భోజనం

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:17 AM

రాష్ట్రంలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

అల్పాహారం.. మధ్యాహ్న భోజనం

  • ఇకపై ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ

  • విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

  • ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు అల్పాహారం

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి

హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఇప్పటివరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దీనిని ఇంటర్‌ వరకు పొడిగించనున్నారు. దీనితోపాటు సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం ద్వారా ఉదయం అల్పాహారం కూడా అందించాలని 2026-27 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం మొత్తంగా రూ.1,400 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న దాదాపు వెయ్యికి పైగా పూర్వ ప్రాథమిక పాఠశాలతోపాటు 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. అల్పాహారం పథకం కింద ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి మాల్ట్‌ అందిస్తారు. ఈ పథకానికేరూ.800 కోట్లు కేటాయించారు.

ఒకేచోట కేజీ టు ఇంటర్‌

రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌’గా అభివృద్థి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిల్లో ఆధునిక భవనాలు, డిజిటల్‌ తరగతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తారు. ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లో 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు తరగతులు ఒకే చోట నిర్వహిస్తారు. ఒక మండల పరిధిలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసి ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా విజయవంతంగా అమలు చేశారు. ఒక్కో పాఠశాలలో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు సుమారు 1,500 మంది విద్యార్థులకు విద్య అందిస్తారు. ఈ స్కూళ్లకు బడ్జెట్‌ రూ.500 కోట్లు కేటాయించారు. ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకాల ద్వారా దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

గోదావరి పుష్కరాలకు 500 కోట్లు

వచ్చే ఏడాది జూన్‌ 26నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. పుష్కరాల్లో 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేశామని, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని బడ్జెట్‌ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 05:17 AM