ఒకటినే జీతం పడాలి!
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:44 AM
ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం....
తేడా వస్తే బాధ్యులపై క్రమ శిక్షణ చర్యలు
25 తేదీలోపే ట్రెజరీలకు బిల్లులను సమర్పించాలి
నెలాఖరుకల్లా ఆడిటింగ్ పూర్తవ్వాలి
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు
సీఎం ఆదేశంతో కదిలిన ఆర్థిక శాఖ
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశిస్తూ ఏకంగా జీవో జారీ చేసింది. సకాలంలో వేతనాలు చెల్లించడంలో విఫలమయ్యే ఆయా శాఖల విభాగాధిపతులు(హెచ్‌ఓడీ), జీతాల పంపిణీ అధికారుల(డీడీ)పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. వేతన, గౌరవ వేతన బిల్లుల ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఓడీలు సంబంధిత విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని ఆదేశించింది. ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఇతర గౌరవ వేతన సిబ్బంది అందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందించాల్సిందేనని కరాఖండిగా చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. ఆ మేరకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల వేతనాలను ప్రతి నెలా 12, 13 తేదీల వరకు చెల్లించేవారు. ఒక రోజు కొన్ని జిల్లాలకు, మరో రోజు మరికొన్ని జిల్లాలకు వేతనాలు వేసేవారు. ఇలాంటి సందిగ్ధత వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యేవారు. పక్క జిల్లా ఉద్యోగులు ఫోన్లు చేసి, ‘వేతనాలు పడ్డాయా’ అంటూ వాకబు చేసుకునేవారు. ఈ అసంతృప్తిని ఉపయోగించుకొని అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తూ వస్తోంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్, కొన్ని ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఒకటో తేదీన పడడం లేదు. కొన్ని శాఖల్లో కూడా వివిధ కారణాల వల్ల వేతనాల చెల్లింపు ఆలస్యమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది.
వేతన, గౌరవ వేతన బిల్లుల తయారీలో జాప్యం, వాటిని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో సకాలంలో సమర్పించకపోవడం, ఉద్యోగుల హాజరు అంశంలో గందరగోళం, ప్రభుత్వం నిర్దేశించిన గడువును అనుసరించక పోవడం, బిల్లుల స్ర్కూటినీ, ఆడిటింగ్ తదితర కారణాల వల్ల వేతనాలను ఒకటో తేదీన చెల్లించడం లేదు. వేతనాల చెల్లింపుపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ విషయాలు తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జీవో జారీ అయ్యింది. అన్ని ప్రభుత్వ శాఖలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు కూడా ఒకటో తారీఖు నిబంధనను పాటించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఆర్థిక శాఖ సూచనలను తమ శాఖలు అనుసరిస్తున్నాయో లేదో సంబంధిత ముఖ్య కార్యదర్శులు పర్యవేక్షించాలని చెప్పారు. బడ్జెట్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌ను లేదా తనను సంప్రదించాలని సుల్తానియా ఆదేశించారు.
హాజరును గడిచిన నెల 21వ తేదీ నుంచి కొనసాగుతున్న నెల 20 వరకు లెక్కించాలి.
బిల్లులను 25వతేదీలోపు ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో సమర్పించాలి.
ప్రతీ నెలా చివరి పని దినం(వర్కింగ్ డే) లోపు స్ర్కూటినీ, అడిటింగ్ చేసి 1న బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలి.
నిధులు అందుబాటులో ఉన్నాయో లేవో పంపిణీ అధికారులు నిర్ధారించుకోవాలి. ఆర్థిక, పరిపాలనాపరమైన అనుమతులను ముందే పూర్తి చేసి పెట్టుకోవాలి.