డిగ్రీ కళాశాలల్లో తరగతులు చెప్పేదెవరు?
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:30 AM
ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి.. పైతరగతులకు వచ్చిన ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులతోపాటు ఇటీవలే ప్రవేశాలు పొందిన...
150 డిగ్రీ కాలేజీల్లో 1,900 ఖాళీలు
అతిథి అధ్యాపకులను కొనసాగించని సర్కారు
4 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు
గెస్ట్ లెక్చరర్ల నియామకంలో జాప్యంతో సమస్య
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి.. పైతరగతులకు వచ్చిన ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులతోపాటు ఇటీవలే ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సర విద్యార్థులు కలిపి 3 వేల మంది ఉన్నారు. జూన్ 8వ తేదీనే సెకండియర్, ఫైనలియర్ తరగతులు ప్రారంభమవగా.. ఈ నెల 6 నుంచి ఫస్టియర్ తరగతులు మొదలవుతున్నాయి. కానీ విద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులు లేరు. ఈ నాలుగు కాలేజీల్లో గత ఏడాది ఉన్న అధ్యాపకులు 96 మందికాగా, అందులో ప్రభుత్వ, కాంట్రాక్టు లెక్చరర్లు 34 మందే. మిగతా 62 మంది అతిథి అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్లు). వారిని ఈసారి తిరిగి నియమించలేదు. దీంతో కేవలం 32 మంది అధ్యాపకులతోనే నాలుగు కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇది ఒక్క జిల్లాలోని పరిస్థితి కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లినా కనిపిస్తున్న దుస్థితి. కొత్తగూడెం జిల్లాలో 5 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా.. 51 ఖాళీలున్నాయి. మల్కాజ్‌గిరిలోని 4 కాలేజీల్లో 51, ఖమ్మంలోని 5 కాలేజీల్లో 50, వికారాబాద్ జిల్లాలో 4 కాలేజీల్లో 41, మెదక్‌లో 4 కాలేజీల్లో 40, హన్మకొండలోని 3 కాలేజీల్లో 30, ఆసిఫాబాద్‌లోని 2 కాలేజీల్లో 26 ఖాళీలు.. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. చదువు చెప్పేవారు లేక 4 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,200 మంది ప్రభుత్వ, 530 మంది ఒప్పంద అధ్యాపకులు ఉన్నారు. మరో 1,900 ఖాళీ పోస్టుల్లో ప్రభుత్వం ఏటా అతిథి అధ్యాపకులను నియమిస్తూ వస్తోంది. ఈసారి వీరి నియామకానికి సంబంధించి ఆర్థికశాఖ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇప్పుడే కాదే డిగ్రీ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ ఏటా జాప్యమవుతూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో కాలేజీలు ప్రారంభమైనా బోధన జరగడం లేదు. నిజానికి జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఒకసారి అతిథి అధ్యాపకులను నియమిస్తే.. ఏటా వారినే కొనసాగిస్తున్నారు. దానితో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే బోధనకు ఇబ్బంది ఉండటం లేదు. కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏటా త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేపడుతున్నారు. అంతేకాదు వారితో ఒప్పందం 11నెలలకు అని పేర్కొన్నా.. 7 నెలల పాటే తరగతులుంటాయి. ఆమేరకే వేతనాలిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది నియమించిన గెస్ట్ లెక్చరర్లనే ఈసారీ కొనసాగించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల గెస్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కొర్ర ఈశ్వర్‌లాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.