సర్కార్‌కు ఎయిర్‌బస్ హెచ్-160 హెలికాప్టర్!
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:00 AM
అధికారిక కార్యక్రమాలు, వీఐపీల ప్రయాణాల కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
అద్దెకు తీసుకునే యోచన.. అన్ని అంశాలపై అధ్యయనం కోసం త్వరలో కమిటీ
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): అధికారిక కార్యక్రమాలు, వీఐపీల ప్రయాణాల కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోందని సమాచారం. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి ఈ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయా అంశాలపై అధ్యయనానికి త్వరలోనే ఒక కమిటీని నియమించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వద్ద 8 సీట్లతో కూడిన ఆగస్థ్య-169 హెలికాప్టర్ అందుబాటులో ఉంది. దీనిస్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించా రు. అత్యాధునిక మధ్యతరహా ట్విన్ ఇంజన్ హెలికాప్టర్లలో ఒకటిగా ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ గుర్తింపు పొందింది. 6, 8, 12 సీట్ల సామర్థ్యం, రెండుఇంజన్లు, గంటకు 255కిలోమీటర్ల గరిష్ఠ వేగం, ఒకేసారి 4.30 గంటల పాటు ప్రయాణం.. దీని ప్రత్యేకతలు. ఆటో పైలట్, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలతో తయారు చేసిన ఈ హెలికాప్టర్‌లో.. ఇంజన్లశబ్దం లోపలికి వినపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తు న్న చాపర్‌కు నెలకు రూ.2 కోట్ల వరకు అద్దె చెల్లిస్తుండగా, కొత్త చాపర్‌కు రూ.5కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. అయి తే, హెచ్-160 మోడల్ హెలికాప్టర్ నిర్వహణపై అనేక ఫిర్యాదులు ఉన్నట్టు చెబుతున్నారు.