Share News

కోకాపేటలో బీఆర్‌ఎస్‌‌కు 11 ఎకరాల భూకేటాయింపు చట్టవిరుద్ధం

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:02 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూకేటాయింపు ...

కోకాపేటలో బీఆర్‌ఎస్‌‌కు 11 ఎకరాల భూకేటాయింపు చట్టవిరుద్ధం

  • కౌంటర్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూకేటాయింపు చట్టవిరుద్ధంగా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కన్వేయన్స్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌తోపాటు స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లోనూ లోపాలున్నాయని పేర్కొంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలోని సర్వే నెంబర్లు 239, 240లలో ఉన్న దాదాపు 11 వందల కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ఆ పార్టీకి కేటాయించారు. ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌, న్యాయవాది వెంకట్రామిరెడ్డి హైకోర్టులో రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2023లో మొదటి పిటిషన్‌ దాఖలు కాగా అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్లలో కౌంటర్‌ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్‌కు జరిగిన భూకేటాయింపు చట్టవిరుద్ధమని తన కౌంటర్‌లో పేర్కొంది. వివాదాస్పద స్థలం ఖాళీగానే ఉందని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలు కాలేదని తెలిపింది. రాజకీయ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదిత భవనాలు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించారని.. అది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది శిక్షణకు ఉద్దేశించింది కాదని వివరించింది. ఈ మేరకు సదరు భూకేటాయింపు చట్టప్రకారం జరగలేదని పేర్కొంది. అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో భూమి అత్యంత విలువైన వనరు అని.. కొంతమందికి తక్కువ ధరలకు భూములు కేటాయించడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. రాజ్యాంగపరంగా గుర్తించిన ప్రజావసరాలకు తప్ప వేరే అవసరాలకు మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకు భూమి కేటాయించడానికి వీల్లేదని చెప్పింది. ప్రస్తుత కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీ మానవ వనరుల అభివృద్ధి కోసం 11 ఎకరాలు కేటాయించుకోవడం రాజ్యాంగం గుర్తించిన ప్రజావసరాల విభాగంలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి పాలకుల తమకు అనుకూలంగా తామే భూమి కేటాయించుకున్నారని చెప్పింది. గత ముఖ్యమంత్రి ఆమోదం మేరకు భూకేటాయింపు ప్రతిపాదనను మంత్రిమండలి ఎదుట ఉంచారని.. క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం ఆమోదించిన ధరకు భూకేటాయింపు జరిగిందని వివరించింది. అప్పటి బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారని.. అయితే సదరు పార్టీ పబ్లిక్‌ బాడీ కాదని లేదా సదరు కేటాయింపు ప్రజావసరాల కోసం జరగలేదని ప్రభుత్వం చెప్పింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి సదరు 11 ఎకరాల భూకేటాయింపు అప్పటి ప్రభుత్వం కేటాయించి ఉండకూడదని పేర్కొంది. అలాగే అందుకు సంబంధించిన కన్వేయన్స్‌ డీడ్‌ కూడా సరైన విధంగా రిజిస్ర్టేషన్‌ జరగలేదని.. స్టాంప్‌ డ్యూటీ చెల్లించకపోవడం సహా అనేక లోపాలు ఉన్నాయని తెలిపింది.

Updated Date - Apr 10 , 2026 | 05:02 AM