Share News

భూములిచ్చిన వారికి కొత్త ఊరు

ABN , Publish Date - May 19 , 2026 | 05:24 AM

వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమలనే కాదు.. ఆ పార్కు కోసం భూములను త్యాగం చేసిన వారికి ప్రత్యేకంగా ఒక ఊరును కూడా నిర్మిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ......

భూములిచ్చిన వారికి కొత్త ఊరు

  • వరంగల్‌ కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో గ్రామాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం .. 90కోట్ల ఖర్చుతో రాజీవ్‌గాంధీ టౌన్‌షిప్‌

  • 863 మంది భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు

  • బడి, ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్‌, రోడ్లు, పశువుల ఆస్పత్రి తదితర మౌలిక సదుపాయాలు

  • టెక్స్‌టైల్‌ పార్కులో స్థానికులకు ఉద్యోగావకాశాలు

  • రానున్న రోజుల్లో పలు రాష్ట్రాలకు ‘మేడిన్‌ తెలంగాణ’ వస్త్రాలు

వరంగల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమలనే కాదు.. ఆ పార్కు కోసం భూములను త్యాగం చేసిన వారికి ప్రత్యేకంగా ఒక ఊరును కూడా నిర్మిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు మౌలిక వసతులు కల్పించేందుకు రూ.90 కోట్ల వ్యయంతో పనులు మొదలు పెట్టారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని శాయంపేట, సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామాల పరిధిలో 1,357 ఎకరాల్లో గత ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును తలపెట్టింది. అయితే ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. 2023లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి 2024 జూన్‌ 29న పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రూ.10 లక్షలకే ఎకరం చొప్పున తమ భూములను గత ప్రభుత్వ హయాంలో స్వాధీనం చేసుకున్నారని, సాగు భూములను కోల్పోయి గోస పడుతున్నామని వాపోయారు. ఉండేందుకు తమకు ఇళ్లు కూడా లేవని తెలిపారు. గత ప్రభుత్వం సొంత ఇంటితోపాటు కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చి భూములు తీసుకుందని, ఆ తరువాత ముఖం చాటేసిందని చెప్పారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వారికి ఏం కావాలో తెలుసుకుని తనకు నివేదిక ఇవ్వమని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

54 ఎకరాల్లో గ్రామం నిర్మాణం

ఈ నేపథ్యంలో, నిర్వాసితుల కోసం సంగెం మండలం ఊకల్‌-చింతలపల్లి రైల్వే లైన్‌ సమీపంలో 54 ఎకరాల్లో రాజీవ్‌గాంధీ టౌన్‌షి్‌ప పేరుతో టెక్స్‌టైల్‌ పార్కులో ఒక గ్రామాన్ని నిర్మిస్తున్నారు. టెక్స్‌టైల్‌ పార్కుకు 1,357 ఎకరాలు అప్పగించిన 863 మంది రైతులకు 75 గజాల చొప్పున స్థలాల్ని ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.43.15 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు నిర్వాసితులకు ఇళ్లస్థలాల పత్రాలను అధికారులు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు కావటంతో లబ్ధిదారులు సొంతంగా నిర్మించుంటే బిల్లులు చెల్లిస్తామని, లేదంటే ప్రభుత్వమే ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి 419 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఇంటిని నిర్మించి ఇస్తామని అధికారులు తెలిపారు. భూకంపాలను కూడా తట్టుకునేలా ఇళ్లను నిర్మించేందుకు ఓ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. అయితే లబ్ధిదారులు సొంతంగా ఇళ్లను నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు,


రూ.45 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్‌గాంధీ టౌప్‌షిప్లో మౌలిక సదుపాయాల పనులు చేపట్టారు. వీటిలో రూ.9.20కోట్ల వ్యయంతో తాగునీటి పైపులైన్లు, తాగునీటి శుద్ధి ప్లాంటు, వాటర్‌ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థలను నిర్మిస్తున్నారు. రూ.2.77 కోట్లతో ప్రాథమిక పాఠశాల, రూ.68 లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయం, 1.60 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూ.1.60 కోట్లతో బీటీ రోడ్లు, కల్వర్టులు, 58 లక్షలతో పశువుల అస్పత్రితో పాటు కమ్యూనిటీ హాల్‌, విద్యుత్‌ కనెక్షన్‌ తదితర కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీనిపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ టెక్స్‌టైల్‌ పార్కులో రెండు కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలు, టైలరింగ్‌లో అనుభవం ఉన్న స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ కీటెక్స్‌ కంపెనీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వస్త్రపరిశ్రమకు కలిసి వస్తున్న పరిస్థితులు

గతంలో బంగ్లాదేశ్‌ నుంచి మన దేశానికి వస్త్రాలు, దుస్తులు ఎక్కువగా దిగుమతి అయ్యేవి. అయితే బంగ్లాదేశ్‌లో తలెత్తిన అస్థిరత నేపథ్యంలో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, స్వదేశంలోనే వీటి ఉత్పత్తికి డిమాండ్‌ పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఎంపిక చేసింది. టెక్స్‌టైల్‌ పార్కును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. టెక్స్‌టైల్‌ పార్కులో ఉత్పత్తి కూడా మొదలైంది. దీంతో భవిష్యత్తులో దేశంలోని పలు ప్రాంతాలకు ‘మేడిన్‌ తెలంగాణ’ దుస్తులను సరఫరా చేసే అవకాశాలు లభిస్తాయన్న అంచనాలు ఇక్కడి స్థానికుల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం మూడు కంపెనీలే పెట్టుబడి పెట్టినప్పటికి, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు తరలివస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 19 , 2026 | 05:24 AM