చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:58 AM
తెలంగాణకు గర్వకారణమైన పోచంపల్లి చేనేత కళాకారులకు తగిన ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు...
చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
‘త్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్ ప్రారంభంలో మంత్రి తుమ్మల
ఏడో తేదీ వరకు హైటెక్స్‌లో ఎగ్జిబిషన్
యాదాద్రి, హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు గర్వకారణమైన పోచంపల్లి చేనేత కళాకారులకు తగిన ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చేనేత రంగం, కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘త్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియెగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ చేనేత కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అన్నారు. పోచంపల్లి ఖ్యాతిని, ఉత్పత్తులను వినియోగదారుడి చెంతకు చేర్చేందుకు కలెక్టర్ అనురాగ్ జయంతి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ వస్త్ర ప్రదర్శనకు మరింత మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, చేనేత కళాకారులకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు.పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. వస్త్ర ప్రదర్శన ద్వారా చేనేత కార్మికులకు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, కళాత్మక చేనేత వస్త్రాల రూపశిల్పులు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లోని ఇక్కత్, తదితర చేనేత వస్త్రాలు, ఇతర ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.