రాష్ట్రంలో ‘రైతు డిస్కమ్’
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:05 AM
రాష్ట్రంలో కొత్త, మూడో డిస్కమ్ ఏర్పాటైంది. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(టీజీఆర్‌పీడీసీఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసింది.
తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటు..రాష్ట్ర ప్రభుత్వం జీవో
వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా అంతా ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి
గడిచిన ఐదేళ్లలో ఈ రంగాల్లో విద్యుత్ వినియోగం ఆధారంగా కొత్త డిస్కమ్‌కు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కేటాయింపు
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త, మూడో డిస్కమ్ ఏర్పాటైంది. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(టీజీఆర్‌పీడీసీఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్ బుధవారం జీవో జారీ చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) ఈ డిస్కమ్‌కు లైసెన్స్ జారీ చేయాల్సి ఉంది. ఈఆర్‌సీ లైసెన్స్ జారీ అనంతరం ‘రైతు పవర్ డిస్కమ్’ మనుగడలోకి రానుంది. ఈ కొత్త డిస్కమ్ కార్పొరేట్ కార్యాలయంగా మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ డిస్కమ్‌కు చెందిన ‘బీ’ బ్లాకును కేటాయించారు. వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ తాగునీటి సరఫరా/మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజీ బోర్డు(వాటర్‌బోర్డు), మున్సిపల్ వాటర్ కనెక్షన్ల కోసం విద్యుత్తు సరఫరా.. ఇవన్నీ ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కంపెనీల చట్టం కింద ఈ కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సీఎండీగా ముషారఫ్ అలీని ఇప్పటికే నియమించారు. డైరెక్టర్లుగా తిరుపతిరెడ్డి(ఫైనాన్స్, ఎన్పీడీసీఎల్), కృష్ణారెడ్డి(ఫైనాన్స్, రెవెన్యూ, లీగల్, టీజీఎస్పీడీసీఎల్), మోహన్‌రావు(ప్రాజెక్ట్సు, టీజీఎన్పీడీసీఎల్), నర్సింహులు(ఆపరేషన్, పీ అండ్ ఎంఎం, ఐపీసీ, ఆర్‌ఏసీ, ఎనర్జీ ఆడిట్)గా ప్రభుత్వం నియమించింది. ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరిని, ఎస్పీడీసీఎల్ నుంచి ఇద్దరిని ఈ కొత్త డిస్కమ్‌లో డైరెక్టర్లుగా నియమించారు. కంపెనీ షేర్ హోల్డర్లుగా గవర్నర్‌తో పాటు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ, రైతు పవర్ డిస్కమ్ సీఎండీ, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ల సీఎండీలు, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు ఉన్నారు.
42శాతం వాటా కొత్త డిస్కమ్ పరిధిలోకే
రాష్ట్రంలో 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డు కనెక్షన్లు, 1,132 మిషన్ భగీరథ ప్రాజెక్టుల కనెక్షన్లు కొత్త డిస్కమ్ పరిధిలోకి వెళతాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, వాటర్‌బోర్డు, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ/మిషన్ భగీరథ కనెక్షన్లు ఏ మేరకు విద్యుత్‌ను వినియోగించాయో ఆ నిష్పత్తి ఆధారంగా కొత్త డిస్కమ్‌కు పీపీఏ(విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు)లను బదలాయించనున్నారు. ఐదేళ్లకాలంలో ఆయా కనెక్షన్ల వినియోగం 1,56,775 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 42ు వాటాను కొత్త డిస్కమ్ కలిగి ఉండనుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 5,22,479 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లు, 2,61,240 కిలోమీటర్ల మేర వ్యవసాయ ఎల్‌టీ(లో టెన్షన్) లైన్లు కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల విలువ రూ.2,792 కోట్లు, ఎల్‌టీ లైన్ల విలువ రూ.2,137 కోట్లు అని లెక్క వేశారు. దీంతో రూ.4,929 కోట్ల అస్తులు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. ఇక డీటీఆర్‌లు, లైన్ల నిర్వహణ కొత్త డిస్కమే చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త డిస్కమ్ పరిధిలోకి వచ్చే ప్రతీ ట్రాన్స్‌ఫార్మర్‌కు స్మార్ట్ మీటర్‌ను బిగించనున్నారు. ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.25 వేలు ఖర్చు అవుతాయని అంచనా.
బకాయిలు, అప్పుల బదిలీ
ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.22,926 కోట్లు, వాటర్‌బోర్డు(హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సీవరేజీ బోర్డు)కు చెందిన రూ.7,084 కోట్లు, మిషన్ భగీరథకు సంబంధించి రూ.5,972 కోట్లు కలిపి రూ.35,982 కోట్లు ప్రభుత్వం ఇప్పుడున్న డిస్కమ్‌లకు ఇవ్వాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ ఇప్పుడు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. ఇక కేంద్ర విద్యుత్ సంస్థలకు తెలంగాణ డిస్కమ్‌లు రూ.2,466 కోట్లు, రాష్ట్ర జెన్‌కోకు రూ.26,950 కోట్లు, ఐపీపీ/ఇతరులకు రూ.2,281 కోట్లు కరెంట్ బిల్లుల రూపంలో కట్టాల్సి ఉంది. ఇందులో తెలంగాణ జెన్‌కోకు డిస్కమ్‌లు చెల్లించాల్సి ఉన్న రూ.26,950 కోట్లు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. అంటే ఈ డబ్బును కొత్త డిస్కమ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2025 జూలై 31వ తేదీ నాటికి వర్కింగ్ క్యాపిటల్ రుణాలుగా తెలంగాణ డిస్కమ్‌లు రూ.55,979 కోట్ల తీసుకోగా...అందులో రూ.9,032 కోట్ల అప్పును కొత్త డిస్కమ్‌కు బదలాయించనున్నారు. ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు(సీఈ), ప్రతీ పాత జిల్లాకు ఒక ఎస్‌ఈ చొప్పున 10 మందిని, 38 సర్కిళ్లకు ఒక్కో డీఈని, 90 మంది ఏడీఈలను, 520 మంది సబ్ ఇంజనీర్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ ఎం) ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు కలిపి 1000 మంది, పాలన సిబ్బంది 340 మంది కలుపుకొని 2 వేల మందితో కొత్త డిస్కమ్‌కు డిప్యూటేషన్‌పై సర్దుబాటు చేయనున్నారు.