తండాల నుంచి సాఫీగా ప్రయాణం
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:52 AM
ఏళ్ల తరబడి సరైన రోడ్ల మాటే లేదు.. వర్షాకాలం వచ్చిందంటే చాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయ్.. రాష్ట్రంలోని మారుమూల గిరిజన పల్లెలు, కోయగూడేలు, ఆదివాసీ, ఇతర ఆవాసాల దురవస్థ ఇది
ప్రతి ఆవాసానికి పక్కా రోడ్డు
823 పనులకు గిరిజన శాఖ గ్రీన్‌సిగ్నల్
రూ.1600 కోట్లతో ప్రణాళికలు సిద్ధం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి సరైన రోడ్ల మాటే లేదు.. వర్షాకాలం వచ్చిందంటే చాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయ్.. రాష్ట్రంలోని మారుమూల గిరిజన పల్లెలు, కోయగూడేలు, ఆదివాసీ, ఇతర ఆవాసాల దురవ స్థ ఇది. ఇక అడవి బిడ్డల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేపట్టింది. ‘తండాల నుంచి సాఫీగా’ .. ప్రయాణం సాగాలనే సంకల్పంతో... ప్రతి ఆవాసం నుంచి దగ్గర్లోని బీటీ రోడ్డుకు కలిపేలా తారు రోడ్లను నిర్మించనున్నారు. ఈ క్రమంలో గతేడాది చేపట్టిన రూ.950 కోట్ల పనుల పురోగతిని సమీక్షించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు సౌకర్యంలేని 823 ఆవాసాలను ప్రాధాన్యతగా గుర్తించారు. అంటే.. 823 బీటీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.1600 కోట్ల వ్యయం అవుతుందని గిరిజన సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ పనులకు ప్రతినెలా రూ.150 కోట్లను జూన్ వరకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గుత్తేదార్లు ఏడాది లోపే ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టనుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే రోడ్డు సదుపాయం లేని ఆవాసం అనే మాటే ఉందడని భావిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ఆయా గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సర్కారు భావిస్తోంది. తద్వారా పాఠశాలలు, అసుపత్రులు, మార్కెట్లు చేరుకోవడం సులభం అవుతుంది. రైతులు ఉత్పత్తులను మార్కెట్‌కు సులభంగా చేర్చగలుగుతారు. కాగా గతంలో రోడ్ల కోసం కేటాయించిన రూ.950 కోట్లలో సుమారు 1,682 కి.మీ.మేర పనులు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఆరు నెలల్లో వీటిని పూర్తిచేయాలని కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా రూ.20వేల కోట్లతో ప్రతి గ్రామాన్ని రాజధానితో అనుసంధానించేందుకు మెగా రోడ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన ప్రాంతాల రోడ్లు కూడా ఇందులో భాగంగా మరింత మెరుగుపడేందుకు అవకాశముంది. ప్రతి ఆవాసానికి రోడ్డు సౌకర్యం కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు.