ఆరోగ్య పథకంపై ఉద్యోగులు-ప్రభుత్వం మధ్య చర్చలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:26 AM
ప్రభుత్వం మరో రెండు వారాల్లో ఉద్యోగుల కోసం నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, అందులో భాగంగా రూ.1,056 కోట్లతో బీమా పథకాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం మరో రెండు వారాల్లో ఉద్యోగుల కోసం నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, అందులో భాగంగా రూ.1,056 కోట్లతో బీమా పథకాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం, ఉద్యోగులు చెరి సగం వాటా భరించేలా చర్చలు జరిగాయి. ఉద్యోగి మూల వేతనం నుంచి ప్రభుత్వం 1.5 శాతం వాటాను మినహాయించి కార్పస్ ఫండ్‌లో జమ చేస్తుంది. ఈ ఆరోగ్య పథకం ద్వారా మొత్తం 12.84 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరనుందనేది ప్రభుత్వ వాదన. అయితే, కొత్త ఆరోగ్య పథకంపై ఉద్యోగులు, పింఛనుదారుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాచుకున్న డబ్బే చెల్లించని ప్రభుత్వం.. మూల వేతనం నుంచి ఆరోగ్య పథకానికి జమ చేసే మొత్తాన్ని ఇతర పథకాలకు మళ్లించదనే గ్యారెంటీ ఏంటి..? అని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.