రాజధానిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు లేవు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రోత్సాహకాలు అందించేందుకు రూపొందించిన విధానం అమలుకు సంబంధించి..
మిగతా ప్రాంతాల్లోని సూక్ష్మ, చిన్న మధ్య తరహాపరిశ్రమలకు రాయితీలు.. జీవో నం.6 విడుదల చేసిన సర్కారు
హైదరాబాద్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రోత్సాహకాలు అందించేందుకు రూపొందించిన విధానం అమలుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబరు 6ను విడుదల చేసింది. దాని ప్రకారం.. జనరల్ కేటగిరీ వ్యక్తులు, సంస్థలు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిస్తే పెట్టుబడిపై 25శాతం రాయితీని సర్కారు అందించనుంది. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం పెట్టుబడి రాయితీ అందిస్తుంది. ఈ కేటగిరీల్లోని మహిళలు పరిశ్రమలు పెడితే అదనంగా మరో 20 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు స్థాపించేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మాత్రం దీని నుంచి మినహాయించింది. అంటే.. ఆయా ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు పెట్టినా రాయితీలు వర్తించబోవని స్పష్టం చేసింది. అవేంటంటే.. సనత్‌నగర్, అజామాబాద్, చందులాల్ బరాదరి, కాటేదాన్. ఈ ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో స్థాపించిన పరిశ్రమల యూనిట్లకు రాయితీలు వర్తించవు. 18-09-2024 నుంచి 31-03-2029 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది. 18-09-2024 నుంచి ఇప్పటివరకూ ప్రారంభించిన యూనిట్లు పాత టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద.. లేదా ఈ కొత్త పాలసీ కింద ప్రోత్సాహకాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. 18-09-2024 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు ఇప్పటినుంచి ఆరు నెలల్లోగా ప్రోత్సాహకాలు, రాయితీల కోసం దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇకపై ఉత్పత్తి ప్రారంభించే యూనిట్లు, ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న గడువుల ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలి. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని.. హైదరాబాద్ పరిశ్రమల డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
జనరల్ కేటగిరీ కింద రాయితీలు, ప్రోత్సాహకాలు..
ఎంఎస్ఎంఈల స్థాపన కోసం భూమి కొన్నప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 100 శాతాన్ని ప్రభుత్వం వెనక్కిస్తుంది.
భూమి, షెడ్, భవనాల లీజుకు, మార్ట్‌గేజ్, హైపోతికేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీపై కూడా 100 శాతం తిరిగిస్తుంది.
టీజీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామిక ఎస్టేట్స్, పార్కులలో భూములు కొనుగోలు చేస్తే.. వాటి ధరల్లో 25 శాతం లేదా రూ.10 లక్షల వరకు రాయితీ అందిస్తుంది.
ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు.. యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్‌పై ఫిక్స్‌డ్ సబ్సిడీ.
పెట్టుబడి సబ్సిడీ కింద తయారీ రంగంలో స్థిర మూలధన పెట్టుబడిలో 25ు లేదా రూ. 30 లక్షల వరకూ సబ్సిడీ. ఈ కేటగిరీలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మరో 20 శాతం అదనంగా రాయితీలు.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకైతే..
పారిశ్రామిక అవసరాల కోసం భూమి కొన్నప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 100 శాతాన్ని ప్రభుత్వం వెనక్కిస్తుంది.
భూమి, షెడ్, భవనాల లీజుకు, మార్ట్‌గేజ్, హైపోతికేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ కూడా 100 శాతం తిరిగి చెల్లిస్తుంది.
టీజీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామిక ఎస్టేట్స్, పార్కులలో భూములు కొనుగోలు చేస్తే 50 శాతం లేదా రూ.50 లక్షల దాకా సబ్సిడీ.
వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి ఐదేళ్లపాటు యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున విద్యుత్‌పై ఫిక్స్‌డ్ సబ్సిడీ.
ఈ కేటగిరిలోని మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడి సబ్సిడి కింద అదనంగా 20 శాతం లేదా రూ.కోటి 20 లక్షల వరకు సబ్సిడీ కల్పిస్తారు. అలాగే.. సేవల రంగంలో ఎంఎస్ఎంఈలు ప్రారంభించే ఈ వర్గాల్లోని పురుషులకు స్థిర మూలధన పెట్టుబడిలో 35 శాతం లేదా రూ.75 లక్షల వరకూ సబ్సిడీగా ఇస్తారు. అదే మహిళా వ్యాపారవేత్తలకైతే మరో 10 శాతం అదనపు సబ్సిడీ ఇస్తారు.
10 కిలోమీటర్ల దూరం ఉండాలి
మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి సొంతంగా స్థలాలు కొనుగోలు చేసి అభివృద్ధి చేస్తే.. అలాంటి యూనిట్లకు(స్టాండ్ అలోన్) రోడ్డు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ద్వారా సాయం అందిస్తారు. మౌలిక సదుపాయాల ఖర్చులో 50 శాతం లేదా రూ. కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వాటి ప్రకారం.. ఈ తరహా స్టాండ్ ఎలోన్ పరిశ్రమలు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌కు, ఐడీఏలకు కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉండాలి.