Share News

జీవో 59కు జై

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:45 AM

ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జీవో 59కు జై
land

go-59.jpg

  • 500 గజాల్లోపు భూముల క్రమబద్ధీకరణకు ఓకే

  • పెండింగ్‌ దరఖాస్తులను నెలలో పరిష్కరించాలని ఆదేశం

  • గత జీవోల ఆధారంగా మెమో జారీ చేసిన ప్రభుత్వం

  • క్రమబద్ధీకరణ పాత ధరల ప్రకారమేనా!? త్వరలో స్పష్టత

  • గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావద్దు: మంత్రి పొంగులేటి

  • గత ప్రభుత్వ హయాంలో విలువైన భూముల్లో అక్రమాలు

  • రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వేలాది గజాల అన్యాక్రాంతం

  • అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు.. రెండున్నరేళ్లలో విచారణే లేదు

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మెమో 48030 జారీ చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు 14, 22, 29, 41కి అనుగుణంగా ఈ మెమో ఇచ్చినట్లు చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో భూమి రికార్డులు, లబ్ధిదారునికి ఉన్న అర్హత, క్రమబద్ధీకరణ చేయాల్సిన విస్తీర్ణం వంటి అంశాలను పరిశీలించి చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఆయనఉన్నత స్థాయి అధికారులతో జీవో 59పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. నిబంధనల ప్రకారం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


గత ప్రభుత్వ హయాంలో కొన్ని అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతో జీవో అమలును నిలిపి వేశామని, అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించిన, కన్వేయన్స్‌ డీడ్‌ జారీ అయిన కేసులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.

న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద అంశాల విషయంలో సంబంధిత కోర్టులు ఇచ్చే ఆదేశాలకు లోబడి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నా అనేక కారణాలతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచారని, దీంతో చిన్న చిన్న ఇళ్ల స్థలాలు, ఆస్తులకు సంబంధించిన సమస్యలతో సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

విలువైన భూముల్లో అవకతవకలు

ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వ హయాంలో తొలుత 2014 డిసెంబరు 30న జీవో 59 జారీ అయింది. తర్వాత కొన్ని మార్పులతో 2022 ఫిబ్రవరి 14న మరోసారి జీవో ఇచ్చారు. తమ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో విలువైన భూములున్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి వంటి జిల్లాల్లో వేలాది గజాల భూములను అన్యాక్రాంతం చేసిన దాఖలాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో అవకతవకలూ ఇక్కడే జరిగాయి. వెయ్యి, 2000 గజాల్లో చిన్నపాటి గుడిసె ఉన్నా క్రమబద్ధీకరణకు అనుమతించారు. బినామీలు, కుటుంబసభ్యుల పేరిట కొంతమంది 2 వేల గజాల నుంచి 7 వేల గజాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, రంగారెడ్డి జిల్లాలో ఈ తరహా కేసులు అధికంగా వెలుగు చూశాయి. జీవో 59 కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 31 వేలు ఉన్నాయి.


అనంతరం మరికొన్ని మార్పులు చేసి 2023లో మరోసారి జీవో జారీ చేశారు. దీనిప్రకారం 125-250 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని ఉన్నవారు మార్కెట్‌ విలువలో 25ు చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకోవాలి. 250-500 గజాలలోపు స్థలం ఆక్రమించి ఉంటే మార్కెట్‌ విలువలో 50ు చెల్లించాలి. 500-700 గజాలలోపు ఉన్నవారు 75ు క్రమబద్ధీకరణ ఫీజు కట్టాలి. 750 గజాల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించి ఉంటే మార్కెట్‌ విలువ 100ు చెల్లించాలని జీవోలో స్పష్టం చేశారు. అప్పట్లో సుమారు 32,788 మంది దరఖాస్తుదారులకు డిమాండ్‌ నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో 11 వేల మంది క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించారు. వీరిలో కొంతమంది పూర్తిగా, మరికొంతమంది పాక్షికంగా చెల్లింపులు చేశారు. అయితే, ఇప్పుడు మరోసారి జీవో జారీ చేసి న నేపథ్యంలో, పాత ధరల ప్రకారమే క్రమబద్ధీకర ణ చేస్తారా!? లేక.. ధరల్లో మార్పులు చేస్తూ కొత్తగా ఉత్తర్వులు ఇస్తారా!? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

అక్రమ క్రమబద్ధీకరణల సంగతేంటి..?

జీవో 59కి సంబంధించి గతంలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా సమాచారం ఉన్నా.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇల్లు లేకున్నా ఉన్నట్లు.. విద్యుత్తు బిల్లులు కట్టకున్నా కట్టినట్లు.. అప్పటికప్పుడే ఆక్రమించినా ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నట్లు.. తప్పుడు పత్రాలు సృ ష్టించి కొందరు అక్రమంగా క్రమబద్ధీకరణ చేయుంచుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను అన్యాక్రాంతం చేశారు. ఈ అక్రమాల మీద అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలను ప్రచురించింది కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రమబద్ధీకరణలను నిలిపివేసింది. క్రమబద్ధీకరణకు అనుమతి పొందిన వారిపై ఫిర్యాదులు వస్తున్నందున 17-8-2023కి ముందు, ఆ తర్వాత కన్వేయన్స్‌ డీడ్‌ (స్థిరాస్తిని ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి మరో వ్యక్తి లేదా సంస్థకు బదిలీ చేయడానికి అనుమతించే చట్టపరమైన పత్రం), రిజిస్ట్రేషన్లు జరిగిన ఆస్తులను ఆపేయాలని, తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని 2024 జనవరి 25న సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు ఇచ్చారు.


ఆయా భూముల్లో లే అవుట్‌, భవన నిర్మాణ అనుమతులు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేసి రెండున్నరేళ్లు దాటింది. ఆయా ఫిర్యాదులపై ఇప్పటి వరకూ ఎటువంటి విచారణ జరపలేదు. నిజానికి, జీవో 59 ముసుగులో గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్‌ నేతలు వందల కోట్ల విలువైన భూములను మింగేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఒక్క రాయదుర్గంలోనే 8.29 ఎకరాలను తమ తొత్తుల పేరిట మార్చుకున్నారని, హైదరాబాద్‌లో మరోచోట ఎకరం రూ.100 కోట్లు ఉన్న భూమికి సంబంధించి 19 ఎకరాలను స్వాహా చేశారని, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములను బినామీల పేరుతో మార్చుకున్నారని, ఆ వివరాలన్నీ సేకరించామని చెప్పారు. ఖమ్మం పట్టణంలోని ఖానాపురం సర్వే నంబరు 272లో 300 గజాల ఖాళీ స్థలం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయడాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. ఖానాపురం డొంకలో 200 గజాలు, 150 గజాల చొప్పున రెండు ప్లాట్లకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను రద్దు చేయాలని అప్పటి కలెక్టర్‌ ఆదేశించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఖరీదైన స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే, జవహర్‌ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి జీవో 59 కింద 50 ఎకరాలను క్రమబద్ధీకరణ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అయినా.. విచారణలో ఎటువంటి పురోగతి లేదు. తాజాగా భూముల క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిన ప్రభుత్వం గతంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Oct 10 , 2026 | 05:50 AM