ఇక సర్కారు మెట్రో
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:41 AM
ఇప్పటివరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మెట్రో ఫేజ్-1ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ద్వారా స్వాధీనం ....
ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం
రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ
రూ.13,538.53 కోట్ల అప్పు ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మెట్రో ఫేజ్-1ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ద్వారా స్వాధీనం చేసుకోవాలని సర్కారు గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ అండ్ టీతో కొద్దిరోజులుగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలోనే బుధవారం సచివాలయంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ లిమిటెడ్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్‌ఎంఆర్‌ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్‌అండ్‌టీ తరఫున డీకే సేన్, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. అలాగే ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ హామీతో ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును (2026 ఏప్రిల్ 30వ తేదీ నాటికి) తెలంగాణ ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పాట్నర్స్ సంస్థ అందించింది.
3 కారిడార్లు.. 69 కి.మీ. నెట్‌వర్క్
హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ 2017 నవంబరు నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కి.మీ. నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్-1, ప్రతిపాదిత ఫేజ్-2 నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్తులోనూ హైదరాబాద్‌కు మరింత సమగ్ర, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిని ఎల్ అండ్ టీ చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చలు జరిపారు.