2 రోజుల్లో ఏఎన్‌ఎం ఫలితాలు: దామోదర
ABN , Publish Date - May 13 , 2026 | 03:57 AM
నర్సింగ్ వృత్తి మానవత్వానికి నిదర్శనమని, రోగులకు చికిత్సతో పాటు వారికి ధైర్యాన్ని, ఆశను కల్పించేది నర్సులేనని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు.
అఫ్జల్‌గంజ్, మే 12(ఆంధ్రజ్యోతి): నర్సింగ్ వృత్తి మానవత్వానికి నిదర్శనమని, రోగులకు చికిత్సతో పాటు వారికి ధైర్యాన్ని, ఆశను కల్పించేది నర్సులేనని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన 1,919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రుల్లో ఖాళీలు అలాగే ఉండిపోయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. మరో రెండు రోజుల్లో 2వేల ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిన 732 ఫార్మసిస్టు పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండేళ్లలో 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో అవకాశాల కోసం ఆయా భాషలతో పాటు ఇంగ్లి్‌షలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.