నేడు గిగ్ వర్కర్ల సమ్మె
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:40 AM
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం (టీఏడీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
12 గంటలు నిలిచిపోనున్న జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ సంస్థల సేవలు
రాష్ట్రవ్యాప్త ఆందోళనకు యూనియన్ల పిలుపు
ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మె, నిరశనలు చేస్తామని వెల్లడి
హైదరాబాద్/రాంనగర్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం (టీఏడీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆకస్మిక సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయా యూనియన్ల ప్రతినిధులు పి.సతీ్‌షకుమార్, షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2-3లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల సమ్మెతో రాష్ట్రంలో 12 గంటలపాటు ఓలా, ఊబర్, ర్యాపిడో, ఫోర్ట్‌టన్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ తదితర కంపెనీల సేవలు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో సమ్మె వాల్‌పోస్టర్‌ను ఆయా సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. సంబంధిత వివరాలను మంగళవారం వారు మీడియాకు వెల్లడించారు. మెటారు వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్- 2025 ప్రకారం యాప్ బేస్డ్ రవాణా సేవల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కనీస బేస్ ఫేర్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయా సంస్థలే ఇష్టానుసారం చార్జీలు నిర్ణయించే విధానానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెతోపాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సమ్మెకు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఇతర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని వివరించారు.