గిగ్.. బుగ్గి
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:40 AM
ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకు భోజనం, మరో క్లిక్‌తో గుమ్మం ముందుకు క్యాబ్, ఆన్‌లైన్‌లో వస్తువు ఆర్డర్ చేస్తే కొన్ని గంటల్లోనే చేతికి.. ఆధునిక జీవనాన్ని ఇంత సులభతరం చేస్తున్న..
వర్కర్ల బతుకులు భారం
రోజుకు 14 గంటలు డ్రైవింగ్
అయినా 86శాతం క్యాబ్ డ్రైవర్లకు మిగులుతోంది నెలకు 30 వేలే
80శాతం మందికి హెల్త్ బీమా లేదు
ఫుడ్, ఈ-కామర్స్ డెలివరీ కార్మికుల పరిస్థితీ అదే..
రాష్ట్రంలో గిగ్ వర్కర్ల జీవితాలపై సీజీజీ అధ్యయనం
గ్యారంటీ ఆదాయం, ప్రత్యేక సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు సిఫారసులు
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకు భోజనం, మరో క్లిక్‌తో గుమ్మం ముందుకు క్యాబ్, ఆన్‌లైన్‌లో వస్తువు ఆర్డర్ చేస్తే కొన్ని గంటల్లోనే చేతికి.. ఆధునిక జీవనాన్ని ఇంత సులభతరం చేస్తున్న ఈ డిజిటల్ వ్యవస్థ వెనుక వేలాది మంది శ్రమ దాగి ఉంది. వారే గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లు. కస్టమర్‌కు కనిపించేది మొబైల్ యాప్‌లో ఓ చిన్న ఐకాన్ మాత్రమే. ఆ ఐకాన్ వెనుక ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తాలూకు కుటుంబం ఉంటుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న ఈ కొత్త శ్రామిక ప్రపంచంపై రాష్ట్ర కార్మిక శాఖ కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అధ్యయనం నిర్వహించింది. గిగ్ వర్కర్ల జీవితాల్లోని మరో కోణాన్ని ఈ అధ్యయనం బయటపెట్టింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో క్విక్ కామర్స్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, ఈ-కామర్స్ రంగాల విస్తరణతో గిగ్ ఎకానమీ వేగంగా పెరుగుతోందని అధ్యయనం గుర్తించింది. వరంగల్, నిజామాబాద్ వంటి రెండో శ్రేణి నగరాల్లోనూ ఈ తరహా ఉపాధి పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా నూ ఇదే ధోరణి. నీతి ఆయోగ్ అంచనాలను నివేదిక ప్రస్తావిస్తూ, భారత్‌లో గిగ్ వర్కర్ల సంఖ్య 2019-20లో 68లక్షలుగా ఉండ గా... 2020-21లో 77 లక్షలకు చేరిందని, 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరొచ్చని పేర్కొంది. అప్పటికి దేశంలోని వ్యవసాయేతర శ్రామికశక్తిలో గిగ్ వర్కర్ల వాటా 6.7శాతానికి చేరవచ్చని అంచనా.
క్షేత్రస్థాయి అధ్యయనం
2024 మార్చి 24 నుంచి ఏప్రిల్ 20 వరకు హైదరాబాద్‌లో ఈ సర్వే జరిగింది. 198 మంది క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ డెలివరీ వర్కర్లను ప్రశ్నించి వివరాలు సేకరించారు. పౌర సమాజ ప్రతినిధులు, కార్మికశాఖ అధికారులు, గిగ్ వర్కర్ల సంఘాల ప్రతినిధులను కూడా కలిశారు. సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం.. క్యాబ్ డ్రైవర్లు తమ వాహనంపై చేసిన సగటు పెట్టుబడి రూ.10,06,113. వారిలో 95.7 శాతం మంది రుణంతో కొనుగోలు చేశారు. సగటు రుణ మొత్తం రూ.4.42 లక్షలకు పైగా ఉంది. క్యాబ్ డ్రైవర్లలో 97 శాతం మంది దీన్నే పూర్తికాల ఉపాధిగా చేసుకుంటున్నారు. రోజుకు 12 నుంచి 14 గంటలు, వారానికి ఆరు రోజులు పని చేస్తున్నారు. సాధారణంగా రోజుకు 200-300కి.మీ. ప్రయాణిస్తూ 6-10 రైడ్లు చేస్తారు. నెలకు సగటున రూ. 74,740 మొత్తం వస్తున్నా.. ఇంధనం, నిర్వహణ తదితర ఖర్చులు రూ.53,180 వరకు ఉంటున్నాయి. ఆదాయంలో 71ు ఖర్చులకే వెళ్తోంది. నికరంగా మిగిలేది రూ.21,560 మాత్రమే. సర్వేలో పాల్గొన్న క్యాబ్ డ్రైవర్లలో 86 శాతం మంది నెలకు రూ.30వేల కంటే తక్కువ నికర ఆదాయమే పొందుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో అగ్రిగేటర్లు వసూ లు చేసే కమీషన్ ప్రధానమైనది. కమీషన్ కోతలు సగటున 25-30 శాతం మధ్య ఉంటున్నాయి. క్యాబ్ డ్రైవర్లలో 80 శాతం మందికి ఆరోగ్య, జీవిత బీమా కవరేజీ లేదు. ఇక, ఫుడ్ డెలివరీ వర్కర్లు రోజుకు 8-10 గంటలు పని చేస్తున్నారు. రోజుకు సగటున 131-160 కి.మీ. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ 21-30 ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారు. నెలవారీ ఖర్చులు పోను మిగులుతున్న నికర ఆదాయం రూ.11,652 మాత్రమే. ఈ-కామర్స్ డెలివరీ సిబ్బంది పరిస్థితి కూడా భిన్నంగా లేదు. వీరు రోజుకు 6-8 గంటలు పనిచేస్తున్నారు. రోజుకు దాదాపు 60 ఆర్డర్లు డెలివరీ చేస్తూ సుమారు 46 కి.మీ. ప్రయాణిస్తున్నారు. వీరి నెలవారీ మిగులుతున్న మొత్తం రూ.14,462.
గిగ్ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ నిధి
‘గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని, అగ్రిగేటర్లు, ప్రభుత్వం, కార్మికులు, సీఎస్ఆర్ తదితర మార్గాల నుంచి నిధులు సమీకరించవచ్చని అధ్యయనం పేర్కొంది. అగ్రిగేటర్ల వార్షిక టర్నోవర్‌పై 1 నుంచి 2 శాతం వరకు కాంట్రిబ్యూషన్ నమూనాను కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ-2020 ఆధారంగా పరిశీలించాలి. వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్థి వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నివేదిక ప్రతిపాదించింది.
కనీస గ్యారంటీ ఆదాయం ఉండాలి
అధ్యయనం ఆధారంగా సీజీజీ కొన్ని సిఫార్సులు చేసింది. అవి, గిగ్ వర్కర్లకు కనీస గ్యారంటీ ఆదాయాన్ని ప్రభుత్వం ఖరారు చేయాలి. క్యాబ్‌ల విషయంలో రేట్‌కార్డు విధానాన్ని తీసుకురావాలి. బేస్ ఫేర్, కిలోమీటర్ రేటు, నిమిషానికి చార్జీ, సర్జ్ ప్రైసింగ్ పరిమితులు వంటి అంశాలను పారదర్శకంగా నిర్ణయించాలి. గిగ్ వర్కర్ల వివరాలను నమోదు చేసి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి. గిగ్ వర్కర్లకు ఉపాధి కల్పిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫాంలనూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి. రైడ్ షేరింగ్ అగ్రిగేటర్లను రవాణా శాఖ వద్ద నమోదు చేయాలి. ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, హోమ్ సర్వీసెస్ తదితర అగ్రిగేటర్లను కార్మిక శాఖ వద్ద నమోదు చేయాలి.