పెట్రో ధరల పెంపుతోజనం విలవిల.. ఖజానా గలగల
ABN , Publish Date - May 19 , 2026 | 04:36 AM
పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై భారం పడుతున్నా.. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న....
రోజువారీ అదనపు రాబడి 1.21 కోట్లు
స్థిరంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా
వదంతులు నమ్మొద్దు: చమురు కంపెనీలు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై భారం పడుతున్నా.. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ‘విలువ ఆధారిత పన్ను(వ్యాట్)’.. ఖజానాకు కాసులు కురిపిస్తోంది. పెట్రో అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.1300-1400 కోట్ల రాబడి వస్తోంది. ఇటీవల లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను రూ.3 మేర పెంచడంతో.. నెలకు రూ.36.38 కోట్ల దాకా అదనపు రాబడి సమకూరనుంది. రాష్ట్రంలో రోజుకు సగటున 58,83,000 లీటర్ల పెట్రోలు వినియోగం ఉంటుంది. పెట్రోలు లీటరుపై పెరిగిన అదనపు రూ.3పై రాష్ట్ర వ్యాట్ 35.2 శాతం ప్రకారం రూ.1.05 వస్తున్నాయి. ఇలా 58,83,000 లీటర్ల అమ్మకాలపై ఒక్క రోజుకు రాష్ట్రానికి అదనంగా రూ.61,71,150 వరకు రాబడి సమకూరుతోంది. అదే నెల రోజులకు రూ.18,53,14,500 వరకు వస్తున్నాయి. ఇక డీజిల్ వినియోగం రాష్ట్రంలో రోజుకు సగటున 73,48,000 లీటర్ల దాకా ఉంటోంది. డీజిల్ లీటరుపై పెరిగిన రూ.3పై రాష్ట్ర వ్యాట్ 27 శాతం ప్రకారం ఖజానాకు రూ.0.81 పైసలు వస్తున్నాయి. అంటే.. రోజుకు డీజిల్ అమ్మకాలపై రూ.59,51,880 దాకా అదనంగా వస్తున్నట్టు. నెల రోజులకైతే ఈ అదనపు రాబడి రూ.17,85,56,400 దాకా ఉన్నట్టు. రెండూ కలిపితే.. రూ.36,38,70,900 వరకు అదనంగా వస్తుందని అంచనా. కాగా.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా డిమాండ్‌కు అనుగుణంగా పూర్తిగా అందుబాటులో ఉందని, ఎక్కడా ఎలాంటి కొరతా లేదని చమురు కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. ఇంధన రవాణా, సరఫరా సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాటిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే రాష్ట్రంలో పెట్రోల్ సరఫరాలో 14.2శాతం, డీజిల్ సరఫరాలో 15.7శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపాయి. ఇంధనం కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని.. ఆందోళన చెందవద్దని.. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. గ్యాస్ సిలిండర్ల కొరత కూడా లేదని.. ఈ నెల 17వ తేదీ వరకూ 20.06 లక్షల గృహావసర సిలిండర్లను డెలివరీ చేశామని వెల్లడించాయి.