10 క్యాటగిరీల్లో గద్దర్ అవార్డులు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:31 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ను 10 క్యాటగిరీల్లో ఇవ్వనుంది. మార్చి 19న ఉగాది పండుగ రోజు ప్రదానం చేయనుంది.
ఈసారి కొత్తగా సామాజిక సందేశాత్మక చిత్రానికి..
సినారె, ఏఎన్‌ఆర్ పేర కొత్తగా ప్రత్యేక అవార్డులు
ఉగాది నాడు ప్రదానం... రేపటి నుంచి స్ర్కీనింగ్
దేశ సినీ పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్
దీని కోసం బ్లూప్రింట్‌ను తయారు చేస్తున్నాం: భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ను 10 క్యాటగిరీల్లో ఇవ్వనుంది. మార్చి 19న ఉగాది పండుగ రోజు ప్రదానం చేయనుంది. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు మధ్య కాలంలో ధ్రువీకరణ పత్రాలు పొందిన సినిమాలను ఎంట్రీలుగా స్వీకరించనుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఆర్టిస్టు, ఉత్తమ టెక్నీషియన్ వంటి అవార్డులు ఇవ్వనుంది. ఈ జాబితాలో కొత్తగా సామాజిక సందేశాత్మక చిత్రాన్ని చేర్చింది. తెలుగు భాషలో నిర్మించిన దేశ, విదేశాల్లోని సినిమాలను కూడా ఎంట్రీలుగా పంపవచ్చని ప్రభుత్వం సూచించింది. అవార్డులు ఇచ్చే క్యాటగిరీలు.. 1.ఫీచర్ ఫిల్మ్ తెలుగు/ఉర్దూ, 2.జాతీయ సమగ్రతా ఫీచర్ ఫిల్మ్, 3.పర్యావరణం/హెరిటేజ్/చరిత్ర సినిమా, 4.అరంగేట్రం ఫీచర్ ఫిల్మ్, 5.పూర్తి వినోద చిత్రం, 6.యానిమేషన్ చిత్రం, 7.స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం, 8.పిల్లల చిత్రం, 9.ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు, 10.సామాజిక సందేశాత్మక ఫీచర్ ఫిల్మ్. కాగా, ప్రభుత్వం ప్రత్యేక అవార్డులు కూడా ఇవ్వనుంది. ఎన్‌టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, టీఎన్ కాంతారావు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డులను ఇవ్వనుంది. ఈ సంవత్సరం కొత్తగా చేర్చిన సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయనుంది. సంగీత దర్శకుడు మణిశర్మ చైర్మన్‌గా జ్యూరీ కమిటీని కూడా ఇదివరకే ప్రకటించింది. కాగా, శుక్రవారం నుంచి అవార్డుల స్ర్కీనింగ్ కార్యక్రమం మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో పనిచేస్తోందని తెలిపారు. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో సినీ పరిశ్రమ పెరగడానికి అంతగా అవకాశాలు లేవని, కానీ దేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి హైదరాబాద్‌కు సానుకూల అవకాశాలు ఉన్నాయన్నారు. అన్ని భాషల సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివస్తే రాష్ట్ర యువత, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. దీనికి బ్లూప్రింట్‌ను ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సినీ అవార్డులను నిర్లక్ష్యం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అవార్డులను పునరుద్ధరించి, సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తోందన్నారు. సమావేశంలో ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ దిల్‌రాజు, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజారమణి, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.