Share News

ప్రపంచానికే తలమానికంగా ఫ్యూచర్‌ సిటీ

ABN , Publish Date - May 29 , 2026 | 03:47 AM

ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

ప్రపంచానికే తలమానికంగా ఫ్యూచర్‌ సిటీ

  • విశ్వనగరాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం

  • నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, మే 28 (ఆంధ్ర జ్యోతి): ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను గురువారం వారు పరిశీలించారు. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయం, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుతో హైదరాబాద్‌తో విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంతో చర్చించి త్వరలోనే ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారంభానికి తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. ఇక్కడ చేసే ప్రతి పని, ప్రతి నిర్ణయం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచ దృష్టిని ఆకర్షించే నగరంగా ఫ్యూచర్‌ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసు కమిషనరేట్‌ ప్రక్రియ పూర్తయిందని, అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు. ఈ నగరం దేశానికే తలమానికంగా ఉంటుందన్నారు. ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంప్‌సలో కొనసాగుతున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి శాశ్వత భవనానికి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

పగటి కలలు ఎన్ని కంటారో కననీయండి

‘ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం విషయంలో సానుకూల దృక్ఫథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంటే, కొంతమంది నెగిటివ్‌ ఆలోచనలతో పగటి కలలు కంటున్నారు. వారి కలలకు అర్థం చెప్పలేముగా’ అని మాజీ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి పొంగులేటి, శ్రీధర్‌బాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘వారు పగటి కలలు ఎన్ని కంటారో కననీయండి... వారి కలలు దీవెనులుగా భావిస్తుస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నామని తెలిపారు.

Updated Date - May 29 , 2026 | 03:47 AM