Share News

ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ డిసెంబరులో..

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:29 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి సంబంధించి తుది మాస్టర్‌ ప్లాన్‌ దాదాపు పూర్తయింది. డిసెంబరులో..

ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ డిసెంబరులో..

  • గ్లోబల్‌ సమిట్‌లో ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • డిసెంబరు 9, 10 తేదీల్లో సమిట్‌ నిర్వహణ

  • స్కిల్స్‌ వర్సిటీ సమీపంలో పెట్టుబడుల సమిట్‌ వేదిక

  • 30 వేల ఎకరాల్లో అన్ని హంగులతో ఫ్యూచర్‌ సిటీ

  • అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక

  • సిద్ధం చేస్తున్న సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ నిర్మాతలు

  • ఫార్చ్యూన్‌ 500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యం

  • శరవేగంగా సాగుతున్న ఎక్స్‌ప్రెస్‌ వే పనులు

  • ఇక కంపెనీలతో సంప్రదింపులు ఫ్యూచర్‌ సిటీలోనే

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి సంబంధించి తుది మాస్టర్‌ ప్లాన్‌ దాదాపు పూర్తయింది. డిసెంబరులో నిర్వహించనున్న ‘గ్లోబల్‌ సమిట్‌’లో ఈ మాస్టర్‌ ప్లాన్‌ను విడుదల చేయనున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక ప్రకారం ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశం. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే పనిని సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్కు సంస్థకు అప్పగించారు. 1950ల్లో సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ను, 1971లో సింగపూర్‌ కాన్సెప్ట్‌ ప్లాన్‌ను రూపొందించారు. దాన్ని ఐదేళ్లకోసారి సమీక్షిస్తారు. అందులో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు భారత్‌ ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో భాగస్వాములు అయ్యారు. ఫార్చ్యూన్‌-500 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తెలంగాణనే మొదటి చాయిస్‌ అయ్యేలా ఫ్యూచర్‌ సిటీని తీర్చిదిద్దుతారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి అపార అవకాశాలు ఉండేలా వివిధ జోన్ల కింద ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. దేశంలో పారిశ్రామికంగా ఇదివరకు నిర్మించిన సిటీలు, హబ్‌లు అన్నీ 500 ఎకరాల్లోనే ఉన్నాయని, ఫ్యూచర్‌ సిటీ ఏకంగా 30 వేల ఎకరాల్లో రూపొందుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఒక సదస్సులో గుర్తు చేశారు. ఫ్యూచర్‌ సిటీని ఏఐ సిటీ, హెల్త్‌ సిటీ, నివాస ప్రాంతాలు, ఎడ్యుకేషన్‌ హబ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌, కూలింగ్‌ సిస్టమ్స్‌తో కూడిన గ్రీన్‌ ఫార్మా హబ్‌, డేటా సెంటర్లు, జీసీసీల ఏర్పాటుకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు.


సినిమా పరిశ్రమకు, పరిశోధనలకు కూడా అవకాశం కల్పిస్తారు. విమానాశ్రయం నుంచి మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌తో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వీలుగా రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తారు. కంపెనీలు త్వరగా కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా సింగిల్‌ విండో క్లియరెన్స్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే కొన్ని ఫార్య్చూన్‌-500 కంపెనీలు ఇక్కడ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కొన్ని నిర్మాణ పనులను ప్రారంభించాయి. అమెజాన్‌ తమ అతి పెద్ద డేటా సెంటర్‌ పనులను ప్రారంభించింది. లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌ కోసం నాగార్జున సాగర్‌ రోడ్డు నుంచి ప్రత్యేక రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతంలో పలు అంతర్జాతీయ కంపెనీల శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ) కార్యాలయ భవనాన్ని ఇటీవలే సీఎం ప్రారంభించారు. ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టే దేశీయ, విదేశీ కంపెనీలతో సంప్రదింపులు ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. గడిచిన రెండున్నరేళ్లలో హైదరాబాద్‌కు 200కు పైగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు వచ్చాయి. దేశంలోనే అత్యంత వేగంగా జీసీసీలను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీసీసీల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్‌ సిటీలో ప్రత్యేక జీసీసీ హబ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు.


డిసెంబరు9,10 తేదీల్లో సమ్మిట్‌

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించింది. ఆ సదస్సులో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. కొన్ని కంపెనీలు కార్యకలాపాల నిర్వహణ స్థాయికి వెళ్లగా కొన్ని కంపెనీలు కార్యాలయాల భవనాలకు శంకుస్థాపనలు చేశాయి. ఈ ఏడాది డిసెంబరు 9, 10 తేదీల్లో గ్లోబల్‌ సమిట్‌ను నిర్వహిస్తున్నారు. గత ఏడాది అమెజాన్‌ వెబ్‌ సర్వీసె్‌సకు దగ్గర్లో నిర్వహించారు. ఈసారి యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ ప్రాంగణానికి దగ్గర్లో ఏర్పాట్లు చేస్తున్నారు.


శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పనులు

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీ వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం మొదటగా రోడ్‌ నెట్‌వర్క్‌పై దృష్టి సారించింది. ఓఆర్‌ఆర్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌కు గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఓఆర్‌ఆర్‌-13 నుంచి అమన్‌గల్‌ మండలం ఆకు తోటపల్లి వరకు మొత్తం 41.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. దీనికి రతన్‌ టాటా రోడ్డుగా నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.4,030 కోట్లు. కంట్రోల్‌ కారిడార్‌, సర్వీసు రోడ్డు, భవిష్యత్‌లో మెట్రో రైల్‌ మార్గం వేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. 300 అడుగుల వెడల్పుతో ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తారు. ప్రస్తుతం రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 19.2 కిలోమీటర్లు మొదటి దశలో నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాత్రింబవళ్లు మిషన్లతో గుట్టలు తొలగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట ఎఫ్‌సీఏడీ కార్యాలయం వరకు రాళ్లు తొలగింపుతో పాటు మట్టి పనులు పూర్తి చేశారు. ఫైఓవర్లు, అండర్‌ పాస్‌లు వచ్చే ప్రాంతాల్లో చకచకా పనులు జరుగుతున్నాయి. కందుకూరు మండలం కొత్తూరు నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు ప్రభుత్వం ఫార్మా సిటీ రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డుకు అనుసంధానంగా మీర్‌ఖాన్‌పేట్‌-బేగరికంచె వద్ద ఎఫ్‌సీడీఏ కార్యాలయం సమీపంలో ఫైఓవర్‌ నిర్మాణానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫార్మాసిటీ సంస్థలకు కేటాయించిన స్థలాలకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ఛానల్‌ ద్వారా నిధులు విడుదల చేస్తోంది. దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రతన్‌ టాటా ఎక్స్‌ప్రె్‌సవే పూర్తయితే ప్రస్తుతం రద్దీగా ఉన్న శ్రీశైలం హైవేకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంతో పాటు తూర్పు, ఉత్తర జిల్లాల ప్రజలు శ్రీశైలం వెళ్లాలంటే తుక్కుగూడ జంక్షన్‌(ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 14) నుంచే వెళ్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తయితే ఎగ్జిట్‌ నంబర్‌ 15 నుంచి కూడా వెళతారు.

Updated Date - Aug 05 , 2026 | 06:04 AM