Share News

Water disputes: టెలిమెట్రీ సొమ్ములు ఖర్చయిపోయాయ్‌!

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:33 AM

కృష్ణా జలాల వినియోగ లెక్కలను పక్కాగా తేల్చడం కోసం టెలిమెట్రీ (నీటి తరలింపును లెక్కిం చే) యంత్రాలు పెట్టడానికి తెలంగాణ ఇచ్చిన సొమ్ములను కృష్ణా బోర్డు ఖర్చు పెట్టేసింది...

Water disputes: టెలిమెట్రీ సొమ్ములు ఖర్చయిపోయాయ్‌!

  • తెలంగాణ ఇచ్చిన నిధుల్ని జీతాలకోసం వాడేసుకున్న కృష్ణా బోర్డు

  • ఏపీ అంగీకరించలేదని టెలిమెట్రీ ఏర్పాటు ప్రతిపాదనలను పక్కనపెట్టిన బోర్డు

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల వినియోగ లెక్కలను పక్కాగా తేల్చడం కోసం టెలిమెట్రీ (నీటి తరలింపును లెక్కిం చే) యంత్రాలు పెట్టడానికి తెలంగాణ ఇచ్చిన సొమ్ములను కృష్ణా బోర్డు ఖర్చు పెట్టేసింది. జీతాల కోసం, బోర్డు నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాలు నిధులు ఇవ్వనందువల్ల వాటిని వినియోగించుకోవాల్సి వచ్చినట్లు సమాచారం ఇచ్చింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ ఇబ్బడిముబ్బడిగా నీటిని తరలిస్తున్నా కచ్చితమైన లెక్కలు లేకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోని ప్రతి కాంపొనెంట్‌ వద్ద టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేసి, లెక్కలు తీయాల్సిందేనని తెలంగాణ కొంతకాలంగా పట్టుబడుతోంది. ఇప్పటికే తొలి దశ టెలిమెట్రీలు ఉన్నప్పటికీ మరిన్ని కాంపొనెంట్ల కింద రెండో దశలో టెలిమెట్రీలు పెట్టాలని కో రుతోంది. ఏపీ నిధులు ఇచ్చేందుకు విముఖత చూపగా.. ఆ నిధులన్నీ తామే భరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ప్రకటించి, రూ.4.15 కోట్లను బోర్డుకు విడుదల చేశారు. టెండర్లు ముగిసి, కేంద్రాలు పెట్టే క్రమంలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆయా ప్రాంతాల్లో టెలిమెట్రీలు పెట్టడానికి ఏపీ అంగీకారం కూడా కీలకమని బోర్డులోని ఒక సభ్యుడు మెలిక పెట్టడమే దీనికి కారణం. కృష్ణా ట్రైబ్యునల్‌-2 తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు ఉండడం.. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై స్పష్టత లేకపోవడం.. జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతుండడంతో తదుపరి టెలిమెట్రీలు అవసరం లేదని బోర్డు పేర్కొంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు రాష్ట్రాల చేతుల్లోనే ఉన్నందున టెలిమెట్రీలు పెట్టాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలకు బోర్డు మంగళవారం లేఖ రాసింది. 2025-26లో మూడు త్రైమాసికాలు పూర్తయినా.. తెలుగు రాష్ట్రాల నుంచి బోర్డు నిర్వహణకు నిధులు విడుదల కాలేదని, ఫలితంగా ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని, దీంతో తెలంగాణ ప్రభుత్వం టెలిమెట్రీల కోసం సమకూర్చి న నిధులను జీతాల కోసం మళ్లించామని బోర్డు గుర్తుచేసింది. ఇక తొలి దశలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల వార్షిక నిర్వహణ 2027 మార్చి దాకా ఉన్నందున.. దీనికి రూ.23.30 లక్షలు చెల్లించామని తెలిపింది. తెలుగు రాష్ట్రాలు 2025-26లో రూ.23.31 కోట్లను విడుదల చేయడానికి అంగీకారం తెలిపినా నిధులు మాత్రం విడుదల చేయలేదని బోర్డు పేర్కొంది.

Updated Date - Jan 07 , 2026 | 03:33 AM