పెట్రో.. పరేషాన్!
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:30 AM
ఇంధన సంస్థలకు ముందస్తుగా ఇండెంట్ పెట్టి నగదు చెల్లించినప్పటికీ సకాలంలో ట్యాంకర్లను పంపడం లేదని, నగదు చెల్లించాక ట్యాంకర్ రావడానికి నాలుగు రోజులపైనే సమయం పడుతుందని పెట్రోల్ బంకుల డీలర్లు వాపోతున్నారు.
వందలాది బంకుల్లో నో స్టాక్ బోర్డులు
ఇంధన కొరతతో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు
డబ్బులు కట్టినా ట్యాంకర్లను పంపని కంపెనీలు
హైదరాబాద్‌లోని బంకుల వద్ద భారీ క్యూ లైన్లు
కొన్ని చోట్ల 2 లీటర్లే పోస్తామంటూ టోకెన్ల జారీ
అధిక కొనుగోళ్లతో జిల్లాల్లోనూ ఆగమాగం
బైక్‌లకు రూ.500, కార్లకు 2వేల చొప్పున కోటా
వరి కోతల నేపథ్యంలో డీజిల్ కొరతతో ఇబ్బంది
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఇంధన సంస్థలకు ముందస్తుగా ఇండెంట్ పెట్టి నగదు చెల్లించినప్పటికీ సకాలంలో ట్యాంకర్లను పంపడం లేదని, నగదు చెల్లించాక ట్యాంకర్ రావడానికి నాలుగు రోజులపైనే సమయం పడుతుందని పెట్రోల్ బంకుల డీలర్లు వాపోతున్నారు. ఇది ఏ ఒకరికో.. ఇద్దరికో ఎదురైన సమస్య కాదు.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రంలోని వందలాది పెట్రోల్ బంకుల్లో ఆదివారం రాత్రి నుంచి నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఆయిల్ కంపెనీల నిర్వాకంతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. సోమవారం ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ కోసం పడరాని పాట్లు పడ్డారు. పెట్రోలు బంకులకు వాహనాలు పోటెత్తడంతో.. చీమల పుట్టలను తలపించాయి. మండుటెండ ను సైతం లెక్కచేయకుండా ద్విచక్ర వాహన చోదకులు గంటల తరబడి క్యూలైన్లలో ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాలశాఖ బులిటెన్లు విడుదల చేస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఇంధన సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రైవేటు బంకులే కాదు.. పౌరసరఫరాలశాఖ, పోలీస్ శాఖ, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచే పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపించగా.. ఇంధనం ఉన్న బంకుల్లో వాహనదారులు బారులుదీరారు. దీంతో సోమవారం ఉదయం కొన్ని బంకుల్లో రెండు లీటర్ల చొప్పున టోకెన్లు ఇచ్చి.. పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో సోమవారం పెట్రోల్, డీజిల్ ఎక్కడా దొరకలేదు. బంకుల్లోకి వాహనాలు వెళ్లకుండా... తాళ్లు, గొలుసులు అడ్డంగా కట్టారు. హనుమకొండలో కొన్ని బంకుల్లో ద్విచక్ర వాహనాలకు రూ.500, కార్లు, ఇతర వాహనాలకు రూ.1,500-2,000 విలువైన పెట్రోల్, డీజిల్‌ను కోటా పద్ధతిలో విక్రయించారు. జనగామ జిల్లాలో బల్క్ విక్రయాలపై నియంత్రణ విధించారు. డీజిల్ గరిష్ఠంగా 200 లీటర్లు, పెట్రోలు గరిష్ఠంగా 40 లీటర్లు మాత్రమే అమ్మాలని నిబంధన పెట్టారు. జనగామ జిల్లాలో 108 పెట్రోలు బంకులుంటే.. డీడీలు చెల్లించినా సరఫరా చేయడం లేదని 14 బంకుల డీలర్లు చెప్పారు. వరి కోతల సమయంలో డీజిల్ కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో బంకులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లాలో 80 శాతం బంకులు మూతపడ్డాయి. పట్టణంలో క్యూలైన్లు ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని బంకుల వద్దకు వాహనదారులు పరుగులు పెట్టారు. భూపాలపల్లి జిల్లాలో డీజిల్ కొరతతో లారీలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. గత వారమే డీడీలు చెల్లించినా.. ఇప్పటికీ ఇంధన సరఫరా చేయలేదని డీలర్లు వాపోయారు.
ఏపీ శివారులోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ఏపీ నుంచి వందలాది వాహనాలు తెలంగాణ బంకుల్లోకి రావటంతో ఒత్తిడి పెరిగింది. వరి కోతల సీజన్ కావడంతో హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఏర్పడింది. భువనగిరి జిల్లాలో పెట్రోలు బంకులు చాలా వరకు మూతపడ్డాయి. వికారాబాద్ జిల్లాలోనూ ఎక్కడ చూసినా నోస్టాక్ బోర్డులే కనిపించాయి. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో రెండు బంకులు ఉండగా... అత్యవసర వాహనాలకే ఇంధనం అందజేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 70 శాతం బంకులు మూతపడ్డాయి. కొన్ని చోట్ల పెట్రోల్ దొరికినా.. డీజిల్ మాత్రం దొరకలేదు. గద్వాలలోని బంకులకు కర్నూలు, నంద్యాల నుంచి వాహనదారులు రావటంతో ఇంధన నిల్వలు నిండుకున్నాయి. వరంగల్ జిల్లాలోని కొన్ని బంకుల్లో సాయంత్రం డీజిల్ వస్తుందని చెప్పడంతో డ్రమ్ములు, క్యాన్లు క్యూలైన్లలో పెట్టారు. కరీంనగర్ జిల్లాలోనూ 80 శాతం పెట్రోలు బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టాయి. మహబూబాబాద్ జిల్లాలో 80 పైగా బంకులుంటే... ఎక్కడా సరిపడా నిల్వలు లేవు. ములుగు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మంగళవారం నాటికి పరిస్థితి చక్కబడుతుందని, ఆయిల్ కంపెనీల సరఫరా పెరిగిందని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు.
ధరలు పెరుగుతాయనేనా?
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హోర్మూజ్ జలసంధి వద్ద చమురు నౌకలు నిలిచిపోవడంతో గత నెల 24 నుంచి 27 వరకు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ సారి ఆయిల్ కంపెనీల అత్యుత్సాహం వల్లే సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10-15 పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ధరలు పెరిగిన తర్వాత పంపితే అదనంగా లాభం వస్తుందన్న భావనతోనే ఆయిల్ కంపెనీలు సరఫరాను జాప్యం చేస్తున్నాయని డీలర్లు విమర్శిస్తున్నారు.