Share News

ఉద్యోగులకు ఉచితంగా ప్రమాద బీమా

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:05 AM

ఉద్యోగులపై రూపాయి భారం వేయకుండా వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఉద్యోగులకు ఉచితంగా ప్రమాద బీమా

  • ఉద్యోగి మరణిస్తే రూ.1.25 కోట్ల పరిహారం: భట్టి

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై రూపాయి భారం వేయకుండా వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీమా సౌకర్యం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం, బ్యాంకుల మధ్య అవగాహన ఒప్పందాల కార్యక్రమం రవీంద్రభారతిలో జరగ్గా, సీఎం రేవంత్‌తో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పథకం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులపై రూపాయి అదనపు భారం పడదని, బ్యాంకర్ల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. ప్రమాదాల్లో ఉద్యోగి మరణిస్తే సంబంధిత కుటుంబానికి రూ.1.25కోట్ల పరిహారం అందుతుందని, విమాన ప్రమాదంలోనైతే రూ.2-3కోట్ల మేర పరిహారం వస్తుందని వివరించారు. ప్రమాదవశాత్తూ వైకల్యం సంభవించినా... ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందన్నారు. 60ఏళ్లలోపు వయస్సున్న ఉద్యోగులకు రూ.10లక్షల మేర జీవిత బీమా రక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. కాగా, ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాలన్న ప్రభుత్వం నిర్ణయం గొప్ప భరోసా ఇచ్చిందని, 14 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారుల్లో ఉత్సాహం నింపిందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 05:05 AM