ధరణి, భూభారతి.. పోర్టళ్ల అక్రమాలపై ప్రత్యేక కమిటీ
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:43 AM
ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాల నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పనలోనే భద్రతా లోపాలు ఉండటం, కొన్ని అక్రమ శక్తులు అనధికారిక ఎంట్రీలు....
ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో భద్రతా లోపాలు
అక్రమశక్తులు అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తింపు
భూభారతి కూడా అదేతరహా లోపాలకు గురయ్యే చాన్స్!
దీని వెనక ధరణి మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే
బాధ్యుల గుర్తింపు, చర్యలు, నివారణకు ప్రభుత్వం నిర్ణయం
మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
వివరాలు వెల్లడించిన రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాల నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పనలోనే భద్రతా లోపాలు ఉండటం, కొన్ని అక్రమ శక్తులు అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో నష్టనివారణకు చర్యలు ప్రారంభించింది. ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై కొన్ని ఆందోళనకర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజసిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయని, వాటిని కొన్ని అక్రమ శక్తులు దుర్వినియోగం చేసి.. కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే ‘నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్’ (ఎన్‌ఐసీ) రూపొందించిన భూ భారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడంతో అదే తరహా లోపాలకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌కు మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీనివెనుక ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యుల గుర్తింపు, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని లోకేశ్‌కుమార్ వెల్లడించారు. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు ఎన్‌ఐసీ పూర్తిగా, కొత్తగా అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయాలని సూచించినట్లు వివరించారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించనుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు.
కమిటీ సభ్యులు వీరే..
మనుచౌదరి, ఐఏఎస్ - కలెక్టర్, మేడ్చల్- మల్కాజ్‌గిరి
ప్రతీక్ జైన్, ఐఏఎస్ - జిల్లా కలెక్టర్, సంగారెడ్డి
అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్ - సంయుక్త కార్యదర్శి, ఐటీ- కమ్యూనికేషన్స్ శాఖ
హర్షవర్ధన్, ఐపీఎస్ -- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
అపూర్వ్ చౌహాన్, ఐఏఎస్ - ప్రాజెక్ట్ డైరెక్టర్, సీఎంఆర్‌వో
మంద మకరంద్, ఐఏఎస్ - ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, ఉట్నూర్
ఎ.సంపత్ - డీఎస్పీ, తెలంగాణ సీఐబీ, సైబర్ క్రైమ్స్
ఎం.సుభాషిణి - డీఐజీ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ
ఎ.శ్రీనివాస సుబ్బారావు - సీనియర్ డైరెక్టర్ (ఐటీ), ఎన్‌ఐసీ